శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 ఆగస్టు 2022 (16:21 IST)

ఇంటి గోడపై మూత్రం పోశాడనీ పొడిచి చంపేశారు...

murder
ఢిల్లీలోని మాలవీయ నగరులో దారుణం జరిగింది. ఇంటి గోడపై మూత్రం పోశాడన్న ఆగ్రహంతో ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీకి చెందిన మనీష్ (25) రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఓ ఇంటి గోడ వద్ద మూత్రం పోశాడు. 
 
అది చూసిన ఆ ఇంటి మహిళ మయాంక్‌ను తప్పుపట్టింది. తాను పెద్ద తప్పేం చేశానంటూ మయాంక్ తిరిగి వాదనకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. అదేసమయంలో మహిళ కుమారుడు మనీష్ అక్కడికి వచ్చాడు. వారి మధ్య గొడవ జరిగింది. మనీష్‌పై మయాంక్ చేయి చేసుకున్నాడు.
 
దీంతో ఆగ్రహించిన మనీష్ వెంటనే తన స్నేహితులు ముగ్గురికి ఫోన్ చేసి పిలిపించాడు. నలుగురూ కలిసి మయాంక్ వెంట పడ్డారు. ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలోని డీడీఏ మార్కెట్ సమీపంలో మయాంక్‌ను పట్టుకున్నారు. 
 
నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచేసి పారిపోయారు. మయాంక్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కాసేపటికే చనిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఘటన వివరాలను ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. మనీష్ తోపాటు అతడి స్నేహితులు రాహుల్, ఆశిష్, సూరజ్‌లను అరెస్టు చేసినట్టు ప్రకటించారు.