శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

అస్సాంలో భారీ అగ్నిప్రమాదం ... 150 దుకాణాలు దగ్ధం

Cambodian casino fire
అస్సాం రాష్ట్రంలోని జోర్హాట్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో జోర్హాట్ పట్టణంలో ఉన్న చౌక్ బజార్‌లోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి నలువైపులకు వ్యాపించడంతో ఏకంగా 150కి పైగా దుకాణాలు కాలిపోయాయి. 
 
ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతం మొత్తం దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 25 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. విద్యుత్ షార్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగినట్టు ప్రాథమిక సమాచారం.
 
కాగా, ఈ ప్రమాదం వల్ల భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. అర్థరాత్రి పూట ప్రమాదం జరగడంతో షాపులన్నీ మూసి ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, ఈ ప్రమాదంలో కాలిపోయిన దుకాణాల్లో ఎక్కువగా వస్త్ర, నిత్యావసర వస్తు దుకాణాలు ఉన్నాయి. కాగా, జోర్హాట్ ప్రాంతంలో గత రెండు నెలల కాలంలో భారీ అగ్నిప్రమాదం జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత యేడాది మార్వారీ పట్టీ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో పలు దుకాణాలు దగ్ధమయ్యాయని చెప్పారు.