నాగ్‌పూర్ టెస్టులో ఇంత "కంగారు"పడిపోతారని ఊహించలేదు : రోహిత్ శర్మ
నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇంతలా కంగారుపడిపోయి మూడు రోజులకే చేతులు ఎత్తివేస్తారని ఊహించలేక పోయామని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 1-0 తేడాతో విజయం సాధించిన విషయం తెల్సిందే. అయితే, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాలో అనూహ్య వైఫల్యంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు.
"ఆస్ట్రేలియా కేవలం ఒక్క సెషన్‌లోనే కుప్పకూలుతుందని మేం అస్సలు ఊహించలేదు. పటిష్టంగా బౌలింగ్ చేయాలనే ముందే ఊహించుకున్నాం. ఒక్కో సేషన్ గడిచే కొద్దీ మ్యాచ్‌పై పట్టు బిగించాలనేది మా ప్రణాళిక. కానీ, ఆస్ట్రేలియా ఒకే సేషన్‌లో ఆలౌట్ అవుతుందని అస్సలు ఊహించలేదు. పిచ్ బౌన్స్‌పై లేకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. కానీ, మా బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ క్రెడిట్ వారికే దక్కుతుంది" అని రోహిత్ అన్నారు.
కాగా, నాగ్‌పూర్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో పది వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసింది. రెండే ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు కేవలం 91 పరుగులకే కుప్పకూలిపోయింది. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు చిత్తుగా ఓడిపోయింది.