ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 30 జూన్ 2021 (07:45 IST)

త్వరలో భారత్‌ కు మోడెర్నా టీకా

భారత్ కు శుభవార్త! అమెరికాకు చెందిన కొవిడ్‌ టీకా మోడెర్నాకు భారత డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌(డీసీజీఐ) అనుమతి వచ్చింది. ముంబైకి చెందిన సిప్లా కంపెనీకి ‘పరిమిత అత్యవసర వినియోగం’ కింద ఆ టీకా దిగుమతికి ఆమోదం లభించింది.

ఈ విషయాన్ని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ వీకే పాల్‌ వెల్లడించారు. మోడెర్నా ఆగమనంతో భారత్‌లో అనుమతి పొందిన కొవిడ్‌ టీకాల సంఖ్య నాలుగుకు చేరుకుంటుందని ఆయన వివరించారు.

‘‘ఇప్పటికే కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌-వీ టీకాలకు అనుమతి ఉంది. మోడెర్నా ఇప్పుడు నాలుగో టీకా. ఫైజర్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాల విషయంలోనూ త్వరలో నిర్ణయం తీసుకుంటాం’’ అని ఆయన వెల్లడించారు.
 
కాగా.. తాము మోడెర్నా దిగుమతి కోసం సోమవారం డీసీజీఐకి అనుమతి చేసుకున్నామని, ఒక్కరోజులోనే అనుమతులు వచ్చాయని సిప్లా కంపెనీ పేర్కొంది. తొలి 100 మంది లబ్ధిదారులకు సంబంధించి వారం రోజులకు సంబంధించి వారి ఆరోగ్య పరిస్థితిని డీసీజీఐకి సమర్పించాల్సి ఉంటుందని వివరించింది.

దిగుమతి చేసుకునే ప్రతి బ్యాచ్‌ను కేంద్ర ఔషధ ల్యాబొరేటరీ(సీడీఎల్‌) తనిఖీ చేస్తుందని, భారత్‌లో తయారయ్యే టీకాకు ఆ అవసరం ఉండదని వెల్లడించింది. అటు మోడెర్నా కూడా తాజా అనుమతిపై స్పందించింది. త్వరలో భారత్‌కు అమెరికా కొవాక్స్‌ టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా కొన్ని డోసులను ఉచితంగా పంపుతామని పేర్కొంది.