బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 21 జూన్ 2021 (05:44 IST)

హైదరాబాద్ లో యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి: మంత్రి కేటీఆర్

ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్న హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పలు సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చిందని,  ఇప్పటికైన ఈ దిశగా కేంద్రం సరైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఈ మేరకు కేంద్ర  ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్ధన్ మరియు కేంద్ర మంత్రి సదానంద గౌడ కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరం కేవలం భారతదేశానికే కాక ప్రపంచ వాక్సిన్ క్యాపిటల్గా ప్రాధాన్యత పొందినదని, భారతదేశం దేశీయంగా తయారు చేసిన తొలి వాక్సిన్ కోవాక్సిన్ ఇక్కడినుంచి తయారు అవుతున్న విషయాన్ని గుర్తించాలని కోరారు.

దీంతోపాటు స్పుత్నిక్ వి, కోర్బావాక్స్, భారత్ బయోటెక్, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి కంపెనీల వ్యాక్సిన్లు సైతం ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నుంచి ఈ సంవత్సరాంతానికి దాదాపు 50 శాతం వాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నదని ప్రకటించిన నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు అవసరమైన వాక్సిన్ ఉత్పత్తి పెద్ద ఎత్తున హైదరాబాద్ లోనే ఉత్పత్తి జరగబోతుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

కేంద్రం చేపట్టబోయే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియకి సుమారు 100 కోట్ల డోసులు హైదరాబాద్ నగరం నుంచి రానున్న ఆరు నెలల్లో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన హైదరాబాద్ నగరంలో వాక్సినేషన్ టెస్టింగ్ సెంటర్ లేకపోవడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.

దేశంలో ఉన్న ఏకైక వాక్సిన్ టెస్టింగ్ కసౌలి లో ఉన్నదని, కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సెంటర్ కి ఇక్కడి సంస్థలు తయారుచేసే ప్రతి బ్యాచ్  వ్యాక్సిన్ ని టెస్టింగ్ కు పంపాల్సిన అవసరం ఉంటుందన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానాల్లో పంపి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పంపించే వెసులుబాటు మాత్రమే ఉన్నదని, మొత్తం ఈ టెస్టింగ్ ప్రక్రియకి 30 నుంచి 45 రోజుల సమయం పడుతుందన్నారు.

దీని ద్వారా విలువైన సమయం వృధా అవుతుందని హైదరాబాదులో ఉన్న బయోటెక్ కంపెనీలు తెలిపారన్నారు. అయితే భారత్ దేశంలో రెండవ వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ని ఏర్పాటు చేయడం ద్వారా మరింత వేగంగా హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా కేంద్రాన్ని కోరారు.

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పెద్ద ఎత్తున ప్రజలకు వ్యాక్సిన్ అత్యవసరంగా మారిన ఈ పరిస్థితుల్లో సాధ్యమైనంత తక్కువ సమయంలో ఎక్కువ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయాలంటే, విలువైన 30-45 రోజుల సమయాన్ని తగ్గించేందుకు హైదరాబాద్లో వ్యాక్సింగ్ టెస్టింగ్ సెంటర్ అత్యావశ్యకమైన విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు.

భారతదేశం వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు ఇప్పటికీ పలు ప్రయత్నాలు చేస్తోందని, ఈ దిశగా ఇక్కడి ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు ఈ వ్యాక్సిన్ సెంటర్ని తక్షణమే ఏర్పాటు చేయాల్సిందిగా కేటీఆర్ కోరారు.

దేశంలోనే అత్యధిక వ్యాక్సిన్ తయారీ కంపెనీలు హైదరాబాద్ లో ఉన్నందున ఆయా కంపెనీలకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఇక్కడ ఈ సెంటర్ని ఏర్పాటు చేయాలని, ఇక్కడ వాక్సిన్ టెస్టింగ్ సెంటర్ని ఏర్పాటు చేస్తే ప్రతి నెల 8 నుంచి 10 కోట్ల అదనపు వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేసే వీలు కలుగుతుందని తెలిపారు.

ప్రస్తుతం భారతదేశంతో పాటు ప్రపంచమంతా మూడవ దశ కరోనా, సెప్టెంబర్ మరియు డిసెంబర్ నెల మధ్యలో వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్న ఆ సమయంలో, దాన్ని ఎదుర్కోవాలంటే సాధ్యమైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్ వేయడమే పరిష్కార మార్గమని మంత్రి కేటీఆర్ తెలిపారు. 
 
ఈ వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన నేషనల్ అనిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్, సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ లాబరేటరీ మాదిరే ఈ వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ని ఏర్పాటు చేయాలని కోరారు.

హైదరాబాద్ నగరంలో ఉన్న జీనోమ్ వ్యాలీ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ కి అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ సరఫరా ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని తక్షణమే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు.