శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 21 జూన్ 2021 (10:57 IST)

హైదరాబాద్ లో వచ్చే వారం నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు

జంట నగరాల్లో ఎంఎంటీఎస్ రైలు ప్రయాణికులకు నిజంగా శుభవార్త.  కరోనా లాక్ డౌన్ ప్రారంభంతో జంట నగరాలలో నిలిచిపోయిన మెట్రో రైళ్లు వచ్చే వారం నుంచి పునః ప్రారంభం కానున్నాయి. ఎన్నిసార్లు అన్ లాక్ ప్రక్రియ ప్రారంభించినా ఎంఎంటీఎస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు ఇప్పటి వరకు ప్రారంభం కాని విషయం తెలిసిందే.

తొలిసారిగా గత ఏడాది మార్చి 22న జనతా కర్ఫ్యూ రోజున ఎంఎంటీఎస్ రైళ్లు నిలిచిపోయాయి. తర్వాత వరుసగా లాక్ డౌన్లతో ఎంఎంటీఎస్ రైళ్లు స్టేషన్ల షెడ్డుల్లో, గ్యారేజీలకే పరిమితం అయిన విషయం తెలిసిందే. పేద, మధ్య తరగతి ప్రజలు 5 లేదా 10 రూపాయల టికెట్లతో జంట నగరాల్లో సులువుగా ప్రయాణించేవారు

ఏడాదిన్నరగా ఎంఎంటీఎస్ రైళ్లు నడవక తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. చిన్నపాటి దూరానికి కూడా వందల రూపాయలు ఖర్చు అవుతుండడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. అసలే కరోనా కష్టకాలంలో పేదలకు అందుబాటు ధరల్లో ఉపయోగపడే ఏకైక రవాణా సాధనం ఎంఎంటీఎస్ రైళ్ల సేవలు ప్రారంభించాలని ఎంతో కాలంగా కోరుతున్నారు.

మెట్రో రైళ్ల కోసం ఫలుక్ నామా జంక్షన్ వరకు ఉన్న డబుల్ లైన్ సదుపాయం శంషాబాద్ (ఉందానగర్ స్టేషన్) వరకు అందుబాటులోకి వచ్చినా ఎంఎంటీఎస్ కల ఇప్పటి వరకు నెరవేరలేదు. ఈ నేపధ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్ర కిషన్ రెడ్డి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు. జంట నగరాల పరిధిలో పేదల పరిస్థితిని తెలియజేసి ఎంఎంటీఎస్ రైళ్లు పునః ప్రారంబించాలని కోరగా.. ఆయన రైల్వే అధికారులతో మాట్లాడి అంగీకారం తెలియజేశారు.

అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ రైళ్లలో ప్రయాణించాలని కేంద్ర హోం శాక సహాయ మాత్యులు కిషన్ రెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో సూచించింది. తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఎంఎంటీఎస్ రైలు సేవలను ఉపయోగించాలని కోరింది. తమ వినతికి వెంటనే స్పందించిన రైల్వే మంత్రికి కిషన్ రెడ్డి కృతజ్ఘతలు తెలిపారు.