మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (20:23 IST)

కరోనా సెకండ్‌ వేవ్‌కు కారణం మోడీనే: రాహుల్‌ గాంధీ

కోవిడ్‌ -19 నియంత్రించడంలో మోడీ సర్కార్‌ విఫలమైందంటూ గతంలో కేంద్రంపై విరుచుకు పడ్డ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి పదునైన విమర్శలు చేశారు. దేశంలో సెకండ్‌ వేవ్‌కు మోడీయే కారణమన్న ఆయన కోవిడ్‌ను అర్థం చేసుకోలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత వేగంతో వ్యాక్సినేషన్ల ప్రక్రియ కొనసాగితే అనేక వేవ్‌లు వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేశారు.

'కరోనా తొలి వేవ్‌ను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. కానీ సెకండ్‌ వేవ్‌కు కారణం మోడీనే. ఆయన స్టంట్స్‌, తన బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమవ్వడంతో కరోనా సెకండ్‌ వేవ్‌కు కారణమైంది' అని ఓ వర్చువల్‌ పాత్రికేయ సమావేశంలో వ్యాఖ్యానించారు.

మోడీ ఓ ఈవెంట్‌ మేనేజర్‌ అని, కానీ ఒకే సమయంలో అన్ని పనులను చక్కదిద్దలేరని, ఏదీ ఏమైనప్పటికీ...ఒకే ఈవెంట్‌పై ఫోకస్‌ అంతా పెట్టి..దాని గురించి మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో తమకు ఇటువంటి ఈవెంట్‌ మేనేజర్‌ వద్దని, తమకు సమర్థవంతమైన, వేగవంతమైన పరిపాలన అవసరమని వ్యాఖ్యానించారు.
దేశానికి ప్రధాని అధిపతిలాంటి వారని, దేశ శ్రేయస్సుకు ఆయన ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు.

కానీ మోడీ చేసిన పనుల వల్ల ఆయనతో ఎవరూ మాట్లాడరని, క్లూ లేకుండా షిప్‌ నడుస్తోందంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని తన ఇమేజ్‌ను రిపేర్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, కానీ డామేజ్‌ జరుగుతూనే ఉందని సెటైర్‌ వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోడీ నిలబడి, దేశాన్ని నడిపించాల్సిన సమయమిదని, ఆయన నాయకత్వం, బలం, ధైర్యాన్ని ప్రదర్శించాల్సిన సందర్భమిదని అన్నారు.

అస్సలు అధైర్యపడకూడదని, మంచి నాయకుడని నిరూపించుకునేందుకు సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. కోవిడ్‌, లాక్‌డౌన్లకు శాశ్వత పరిష్కారం టీకాలు మాత్రమేనని, మాస్కులు, సామాజిక దూరం తాత్కాలికమైనవని అన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఇలానే సాగితే...మూడు...నాలుగు వేవ్‌లు కూడా వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరించారు.