మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 12 జులై 2024 (13:22 IST)

అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహం కోసం అద్దెకు 100 విమానాలు?

Ananth Ambani
Ananth Ambani
ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్‌ల వివాహం శుక్రవారం ముంబైలో అంగరంగ వైభవంగా జరుగనుంది. ఇందుకోసం ముంబైలోని రిలయన్స్ జియో సెంటర్ వేదికకానుంది. 
 
అయితే, శుక్రవారం జరిగే పెళ్లికి హాజరయ్యే అతిథులను తీసుకొచ్చేందుకు మూడు ఫాల్కన్ జెట్‌‌లు సహా 100కుపైగా ప్రైవేటు విమానాలను అద్దెకు తీసుకున్నారు.
 
తమ సంస్థ నుంచి ఫాల్కన్-2000 రకానికి చెందిన మూడు జెట్ విమానాలను అంబానీ కుటుంబం తీసుకుందని క్లబ్ వన్ ఎయిర్ సీఈవో రాజన్ మెహ్రా ప్రముఖ వార్తాసంస్థకు తెలిపారు. 
 
దేశం నలుమూలల నుంచి విచ్చేసే అతిథులను తీసుకొచ్చేందుకు ఒక్కో విమానం కొన్ని ట్రిప్పులు తిరగనుందని చెప్పారు. ఇందుకోసం 100కుపైగా ప్రైవేటు విమానాలు ఉపయోగించనున్నట్లు అంచనా వేశామన్నారు.
 
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న జియో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఈ నెల 12 నుంచి 15 వరకు పెళ్లి వేడుకలు జరగనున్నాయి. 
 
ఈ వేడుకలకు హాజరయ్యే అతిథులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు వీలుగా జియో వరల్డ్ ట్రేడ్ సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అర్థరాత్రి వరకు పెళ్లి వేడుకల వాహనాలకు మాత్రమే ఈ రోడ్లపై తిరిగేందుకు అనుమతి ఉంది. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ట్రావెల్ అడ్వయిరీ జారీ చేశారు.
 
కాగా, అనంత్ - రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలను అత్యంత ఆర్భాటంగా నిర్వహించారు. మొదటి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాన్ని గుజరాత్‌లోని జామ్ నగర్‌లో మార్చి 1 నుంచి 3వ తేదీ దాకా 3 రోజులపాటు సుమారు 2 వేల మంది అతిథులతో ధూంధామ్‌గా చేపట్టారు. 
 
ఈ వేడుకల్లో భాగంగానే 51 వేల మంది స్థానికులకు అంబానీ కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. అనంతరం సుమారు 800 మంది కుటుంబ సన్నిహితులు, స్నేహితులతో కలిసి మే 29 నుంచి జూన్ 1 మధ్య 4 రోజులపాటు ఇటలీ నుంచి ఫ్రాన్స్‌కు ఓ లగ్జరీ క్రూయిజ్ షిప్‌‌లో విహరిస్తూ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు.
 
అలాగే, అంబానీ కోడలు కాబోతున్న రాధికా మర్చంట్ ప్రముఖ ఫార్మా కంపెనీ ఎన్ కోర్ హెల్త్ కేర్ సీఈవో విరేన్ మర్చంట్ - షైలా మర్చంట్‌ల కుమార్తె. దేశంలోని దిగ్గజ ఫార్మా సంస్థల్లో ఇది కూడా ఒకటి. రాధికా మర్చంట్ ఆ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు.