గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 12 జులై 2024 (08:39 IST)

నేడు ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడి వివాహం!!

ananth - radhika
భారత పారిశ్రామిక దిగ్గజం, ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌ల వివాహ మహోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరగనుంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటరు ఇందుకు వేదికకానుంది. ఈ వివాహ వేడుకలో అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ ఒకటి కానున్నారు. ఈ వేడుకకు దేశదేశాల నుంచి ప్రముఖ నటీనటులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు అతిథులుగా వస్తున్నారు. 
 
ముఖ్యంగా, హాలీవుడ్ తారలు కిమ్ కర్దాషియన్, ఖో కర్దాషియన్, ప్రియాంకా చోప్రా - నిక్ జొనాస్ దంపతులు, బాక్సర్ మైక్ టైసన్, బాలీవుడ్ తారలు అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ - అభిషేక్ బచ్చన్, జాన్వీ కపూర్, సారా అలీఖాన్ తదితరులు హాజరుకానున్నట్లు సమాచారం. వీరితోపాటు బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్, అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి జాన్ కెర్రీ, స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిడ్త్, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్, టాంజానియా అధ్యక్షురాలు సామి సులుహు హస్సన్, ఐఓసీ ఉపాధ్యక్షుడు జాన్ ఆంటోనియో, ఫిఫా అధ్యక్షుడు గియన్ని ఇన్ఫాంటినో వంటి ప్రముఖులు రానున్నట్లు తెలుస్తోంది.
 
వ్యాపార రంగం నుంచి అదానీ సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీ, హెచ్ఎస్బీసీ హోల్డింగ్స్ చైర్మన్ మార్క్ టకర్, సౌదీ ఆరామ్ సీఈవో అమిన్ నాస్సర్, మోర్గాన్ స్టాన్లీ ఎండీ మైఖెల్ గ్రిమ్స్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, ముబాదలా ఎండీ ఖల్డన్ ఆల్ ముబారక్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ జే లీ, లాక్డ్ మార్టిన్ సీఈఓ, బీపీ సీఈఓ, ఎరిక్సన్ సీఈఓ, కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ ఎండీ బదెర్ మొహమ్మద్ అల్సయీద్, నోకియా ప్రెసిడెంట్ టామీ ఉయిటో తదితరులు హాజరవుతారని తెలుస్తోంది. శుక్రవారం ముఖ్య ఘట్టమైన శుభ్ వివాహ్‌తో మొదలయ్యే ఈ వేడుకలు.. 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ్ ఉత్సవ్‌తో ముగియనున్నాయి.