శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 నవంబరు 2021 (19:14 IST)

డీజే సౌండ్‌‍కు కోళ్ళకు గుండెపోటు.. 66 కోళ్లు మృతి

సాధారణంగా గుండెపోటు కేవలం మనుషులకు మాత్రమే వస్తుందని అనుకుంటాం. కానీ, కోళ్ళకు కూడా వస్తుందని తాజాగా వెల్లడైంది. అదీ కూడా డీజే సౌండ్‌ను తట్టుకోలేక ఏకంగా 63 కోళ్లు మృతి చెందాయి. ఈ కోళ్లన్నీ ఆ శబ్దాన్ని తట్టుకోలేక గుండెపోటు వచ్చి చనిపోయాయి. దీంతో పౌల్ట్రీఫాం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వింత కేసు ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్‌‍లో సంభవించింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, బాలాసోర్‌కు చెందిన రంజిత్ అనే యువకుడికి పౌల్ట్రీఫాం వుంది. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన ఈ యువకుడు ప్రభుత్వం ఉద్యోగం రాకపోవడంతో సొంతంగా ఈ పౌల్ట్రీని పెట్టుకుని జీవనోపాధి పొందుతున్నాడు. 
 
ఈ క్రమంలో గత ఆదివారం ఆ ఫామ్ పక్కనే ఉన్న ఇంట్లో ఓ వివాహం జరిగింది. రాత్రి 11.30 గంటల సమయంలో చెవులకు చిల్లులు పడేలా డీజే సౌండ్ పెట్టి డ్యాన్సులు చేశారనీ, ఈ కారణంగా కోళ్లు తట్టుకోలేక అల్లాడిపోతూ అటూఇటూ కొట్టుకుంటూ పడిపోయి ప్రాణాలు విడిచాయని పేర్కొన్నాడు. 
 
కోళ్ళ పరిస్థితిని చూసి సౌండ్ తగ్గించాలని ఎంతో ప్రాధేయపడినా వారు పట్టించుకోలేదని వాపోయాడు. మరుసటి రోజున వెటర్నరీ వైద్యుడుకు చూపించగా, అవి గుండెపోటుతో చనిపోయినట్టు నిర్దారించారని తెలిపారు. దీనికి డీజే శబ్దాలే కారణమని స్పష్టం చేసినట్టు తెలిపారు. ఈ అంశంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.