శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (10:59 IST)

నిర్భయ దోషి వినయ్ శర్మ సూసైడ్ అటెంప్ట్ ... ఉరిని తప్పించుకునేందుకేనా?

నిర్భయ అత్యాచారం కేసులో ఉరిశిక్షపడిన ముద్దాయిల్లో ఒకరైన వినయ్ శర్మ తీహార్ జైల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జైలు గోడకేసి తలను బాదుకోవడంతో తలకు గాయమైంది. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించి, చికిత్స చేస్తున్నారు. 
 
ఈ నెల 16న వినయ్‌ శర్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 3వ తేదీన ఉదయం 6 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని న్యాయస్థానం తీర్పు వెల్లడించిన విషయం విదితమే. 
 
మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాలని అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేందర్‌ రాణా సోమవారం ఆదేశించిన విషయం తెలిసిందే. దోషులు ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌కుమార్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ (31)పై కోర్టు డెత్‌ వారంట్‌ జారీచేయడం ఇది మూడోసారి. 
 
శిక్షను వాయిదా వేయించేందుకు దోషులు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో ఒక కొత్త పిటిషన్‌ దాఖలు చేస్తుండటంతో శిక్ష అమలు వాయిదా పడుతూ వస్తున్నది.  
 
కాగా, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన వారం రోజుల గడువు ముగిసిందని, దోషులకు సంబంధించి ఎటువంటి పిటిషన్‌ ఏ కోర్టులోనూ పెండింగ్‌లో లేదని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజీవ్‌ మోహన్‌ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రయల్‌ కోర్టు మార్చి 3న నలుగురిని ఉరితీయాలని తాజా డెత్‌ వారంట్లు జారీ చేసింది