సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 14 జులై 2024 (15:28 IST)

పెళ్లి విందులో మాసం చేపలు వడ్డించలేదని పెళ్లిని రద్దు చేసుకున్న వరుడు కుటుంబం

Biryani
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన వెలుగు చూసింది. పెళ్లి విందులో మాంసం చేపలు పెట్టలేదన్న కారణంగా వరుడు కుటుంబం వివాహాన్ని రద్దు చేసుకుంది. ఈ విచిత్ర సంఘటన వివరాలను పరిశీలిస్తే, వధువు ఇంట్లో జరగాల్సిన పెళ్లి కోసం ఆమె కుటుంబ సభ్యులు చక్కటి ఏర్పాట్లు చేశారు. పనీర్, పులావ్, రకరకాల కూరలతో భారీ స్థాయిలో విందు ఏర్పాట్లు చేశారు. పెద్ద మొత్తంలో కట్నం కూడా ముట్టచెప్పారు. 
 
అయితే విందులో చేపలు, మాంసం రెండూ లేకపోవడం వరుడి కుటుంబానికి రుచించలేదు. వధువు కుటుంబ సభ్యులు, బంధువుల పై గొడవకు దిగారు. నానా బూతులు తిడుతూ వధువు తరపు వారిని కొట్టారు. కర్రలతో సైతం దాడి చేశారు. పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించి వరుడు అక్కడి నుంచి వెళ్లి పోయాడు. దీంతో పెళ్లి రద్దైంది. దీంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరకట్నం కూడా ముట్టజెప్పామని ఫిర్యాదు పేర్కొన్నారు.
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని డియోరియా జిల్లా ఆనంద్ నగర్ గ్రామంలో గురువారం ఈ షాకింగ్ ఘటన జరిగింది. దినేష్ శర్మ కుమార్తె సుష్మను వివాహం చేసుకునేందుకు వరుడు అభిషేక్ శర్మ అతడి కుటుంబ సభ్యులు ఆనంద్ నగర్ గ్రామానికి చేరుకున్నారు. అయితే పెళ్లిలో మాంసాహారం లేదనే విషయం వరుడికి తెలియడంతో అతడు ఆగ్రహంతో రెచ్చిపోయాడు. అప్పటివరకు అంతా సవ్యంగానే జరిగింది. పెళ్లి వేడుకలో భాగంగా దండల మార్పిడి కూడా జరిగింది. కానీ నాన్ వెజ్ లేదనే కారణంతో పెళ్లి కొడుకు, అతడి కుటుంబ సభ్యులు దాడికి తెగబడ్డారు.
 
మాంసాహారం లేదంటూ పెళ్లి కొడుకు అభిషేక్ శర్మ, అతడి తండ్రి సురేంద్ర శర్మ, రాంప్రవేష్ శర్మ, రాజ్కుమార్ అనే వ్యక్తులతో పాటు మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు వధువు కుటుంబ సభ్యులపై దాడి చేశారు. గొడవ ముదరడంతో దాడికి దిగారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వధువు తండ్రి పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
వరకట్నం కూడా భారీగా ఇచ్చామని, నగదు రూపంలో రూ.5 లక్షలు, కారు కొనేందుకు రూ.4.5 లక్షలు ఇచ్చామని, రెండు బంగారు ఉంగరాలు కూడా ఇచ్చారని దినేశ్ శర్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ కొట్లాటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం, కొట్టుకోవడం, కుర్చీలు విసురుకోవడం కనిపించింది.