బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (13:26 IST)

ఫడ్నవిస్‌తో సంజయ్ రౌత్ మంతనాలు.. ఎందుకు కలిశానంటే...

మహారాష్ట్రలో అనూహ్య పరిణామం ఒకటి చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌తో శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ శనివారం రాత్రి రహస్యంగా సమావేశమయ్యారు. ముంబైలోని ఓ లగ్జరీ హోటల్‌లో వీరిద్దరూ సమావేశమైనట్టు వార్తలు గుప్పుమన్నాయి. 
 
గత కొద్ది రోజులుగా పరస్పరం విమర్శల దాడికి దిగుతున్న బీజేపీ, శివసేన పార్టీలకు చెందిన ప్రధాన నేతలు ఇలా సమావేశం అయ్యారన్న వార్తలు దేశ రాజకీయాల్లో చర్చకు దారితీయగా, ఈ సమావేశం నిజమేనని, దీని వెనుక రాజకీయ కారణాలు లేవని బీజేపీ స్పష్టం చేసింది.
 
ఈ విషయమై వస్తున్న ఊహాగానాలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసిన బీజేపీ అధికార ప్రతినిధి కేశవ్‌ ఉపాధ్యాయ్, శివసేన ఆధ్వర్యంలో నడుస్తున్న సామ్నా పత్రిక కోసం ఫడ్నవీస్‌ను ఇంటర్వ్యూ చేయాలని సంజయ్ రౌత్ భావించారని, అందుకే ఆయనతో సమావేశమయ్యారని వెల్లడించారు. 
 
సంజయ్ కోరిక మేరకు ఫడ్నవీస్ హోటల్‌కు వెళ్లారని, అయితే, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లి వచ్చిన తర్వాతనే తాను అందుబాటులో ఉంటానని ఆయన చెప్పి వచ్చారని అన్నారు. 
 
మరోవైపు ఈ భేటీపై సంజయ్ రౌత్ స్పందిస్తూ, పలు అంశాలపై చర్చించడానికే తాను దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశానని చెప్పారు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అని, మహారాష్ట్ర ప్రతిపక్ష నాయకుడన్నారు. 
 
అంతేగాక, బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఆయన బీజేపీ ఇన్‌ఛార్జీగా ఉన్నారని గుర్తు చేశారు. తమ మధ్య  సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ, తాము శత్రువులం కాదన్నారు. తాము సమావేశమైనట్లు సీఎం ఉద్ధవ్‌ థాకరేకు తెలుసని స్పష్టం చేశారు.