బస్తీమే సవాల్, పులివెందులలో 10 వేల మందితో సభ పెడతా: రఘురామకృష్ణ రాజు
తన తోలు తీస్తానని నిన్న వైసీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. తన ఒంటిపై చేయి పడితే కాపాడేదానికి హేమాహేమీలున్నారని, ఆకు రౌడీలు ఏదో చేస్తారని భయపడే స్థితిలో తాను లేనని చెప్పారు.
తోలు తీయడం తన వృత్తి కాదని ప్రజలు అసహ్యించుకునేలా తను మాట్లాడలేనని అన్నారు. తోలు తీసే చేష్టలకు సమాధానం చెప్పే స్నేహితులు తనకున్నారని రఘురామ చెప్పారు. ఎంపీ రాజూ భయ్యా తనకు మంచి స్నేహితుడని, రాజూభయ్యానే కాదు తనకు కంటికి రెప్పలా కాపాడేవారు ఇతర రాష్ట్రాలలో కూడా ఉన్నారని తెలిపారు.
పదివేల మందితో పులివెందులలో సభ పెట్టే సత్తా తనకు ఉందని తెలిపారు. కరోనా తగ్గిన తర్వాత ఈ సంగతి చూద్దామన్నారు. న్యాయ వ్యయవస్థను భ్రష్టు పట్టించేలా తమ వైసీపీ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. తనను అనర్హుడిగా ప్రకటించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అంత దమ్ము వారికి లేదని చెప్పారు. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని చెప్పారు.