శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 మే 2020 (14:48 IST)

లేచిపోయిన ప్రేమజంట... గర్భందాల్చడంతో క్వారంటైన్‍‌లోనే పెళ్లి

ఓ యువతీయువకుడు ప్రేమించుకున్నారు. వారి పెళ్ళికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీంతో గ్రామం నుంచి లేచిపోయారు. పొరుగు రాష్ట్రానికి వెళ్లి కూలిపని చేసుకుంటూ జీవిస్తూ వచ్చారు. అయితే, కరోనా కష్టాలు వారిని చుట్టుముట్టాయి. దీంతో స్వగ్రామానికి వచ్చారు. కానీ, అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. నెగెటివ్ అని వచ్చినా 14 రోజుల క్వారంటైన్‌కు తరలించారు. ప్రియురాలు అప్పటికే గర్భవతి కావడంతో ఆ క్వారంటైనే కేంద్రంలోని ఇతర క్వారంటైన్ సహచరుల సమక్షంలో ఆ ప్రేమ జంట ఒక్కటైంది. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ జిల్లా సాగాడ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సాగాడ గ్రామానికి చెందిన సౌరబ్ దాస్ (19), పింకీరాణి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో గత జనవరిలో తన ప్రియురాలిని తీసుకుని సౌరబ్ దాస్ గ్రామ వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వీరిద్దరూ గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కి వెళ్లిపోయాడు.
 
అక్కడే ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో పనిచేస్తూ ఆమెతో సహజీవనం కొనసాగించాడు. లాక్డౌన్‌ కారణంగా పరిశ్రమ మూసివేయడంతో తిరిగి సొంత గ్రామానికి వచ్చారు. వారిలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేశారు. అయితే, నెగిటివ్‌గా తేలినప్పటికీ 14 రోజుల పాటు అధికారులు వారిని క్వారంటైన్‌లో ఉంచారు.
 
అప్పటికే పింకీరాణి గర్భవతి అని అధికారులు తెలుసుకున్నారు. క్వారంటైన్ సమయం ముగియడంతో అందులోనే వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. క్వారంటైన్‌ కేంద్రంలో ఇన్‌చార్జీలుగా ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు వధూవరుల తల్లిదండ్రులుగా దగ్గరుండి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఆ జంటను క్షేమంగా ఇంటికి చేర్చారు.