శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 మే 2020 (19:46 IST)

ప్రచండ తుఫానుగా మారిన ఎంఫాన్ - అప్రమత్తమైన కేంద్రం

బంగాళాఖాతంలో ఏర్పడిన ఎంఫాన్ తుఫాను ఇపుడు భీకర రూపం దాల్చి ప్రపంచ తుఫానుగా మారింది. ఫలితంగా సోమవారం సాయంత్రానికి మరింత బలపడి, భీకర తుఫానుగా మారనుంది. ప్రస్తుతం ఈ తుఫాను ఒడిశాలోని పారదీప్ రేవు పట్టణానికి దక్షిణంగా 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
 
ఈ రాకాసి తుఫాను ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం సమీపానికి దూసుకువస్తుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. 'ఎంఫాన్‌' తుఫాను పరిస్థితులపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సన్నద్ధత, ఎన్డీఎమ్ఏ కార్యాచరణ గురించి సంబంధింత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
 
ఈ సందర్భంగా అధికారులు, క్షేత్రస్థాయిలో 25 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయని, మరో 12 బృందాలు సిద్ధంగా ఉన్నాయని ప్రధానికి వివరించారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు.
 
మరోవైపు, ఆదివారం నాడు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్‌ దీవుల ప్రాంతానికి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజుల్లో అండమాన్‌ సముద్రం, అండమాన్‌ దీవుల్లోని మిగిలిన ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించే ఆస్కారం ఉందని వాతావరణ కేంద్రం సీనియర్‌ ఆఫీసర్ రాజారావు వెల్లడించారు.
 
ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఎంఫాన్' తుఫాను కారణంగా మంగళవారం రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. 
 
ఇక 'ఎంఫాన్' మరో 24 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారి, తొలుత ఉత్తర దిశగా, ఆపై ఉత్తర ఈశాన్య దిశగా వెళ్లి, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య 20వ తేదీ సాయంత్రంలోగా తీరం దాటే అవకాశం ఉందని రాజారావు అంచనా వేశారు.