అన్‌లాక్-1లో నిర్లక్ష్యం ఫలితమే ఈ కరోనా ముప్పు : ప్రధాని మోడీ
కరోనా ముప్పు జూలై నెలలో మరింత ఎక్కువగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ఈ వైరస్ బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆయన మంగళవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. సుదీర్ఘ లాక్డౌన్‌ను సడలిస్తూ తీసుకువచ్చిన అన్ లాక్-1లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫలితంగా ఇప్పుడు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు.
కరోనా నిబంధనలు పాటించడంలో విఫలమవుతున్నామన్నారు. వైరస్ వ్యాప్తికి ప్రజల నిర్లక్ష్యమే ప్రధాన కారణం అని తెలిపారు. జూలై నుంచి కరోనా ముప్పు భారీగా ఉంటుందని, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్నారు.
ఇక లాక్డౌన్ పరిస్థితుల గురించి మాట్లాడుతూ, లాక్డౌన్‌తో దేశంలోని చాలామంది ఇళ్లలో వంట కూడా చేసుకోలేని పరిస్థితులు ఎదుర్కొన్నారని వెల్లడించారు. అలాంటివాళ్లను కేంద్రం సకాలంలో ఆదుకుందని, అందుకోసమే గరీబ్ కల్యాణ్ యోజన తీసుకువచ్చామని అన్నారు. పేదల కోసం రూ.1.75 లక్షల కోట్ల ప్యాకేజి అమలు చేశామని వివరించారు.
ఇప్పుడు పండుగల సీజన్ వస్తోందని, ప్రజలెవరూ పస్తులు ఉండకూడదన్నది తమ ప్రభుత్వ నిర్ణయం అని మోడీ ఉద్ఘాటించారు. అందుకే దేశంలోని 80 కోట్ల మందికిపైగా నవంబరు వరకు ఉచితంగా రేషన్ సరుకులు అందిస్తామని, అందుకోసం రూ.90 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని తెలిపారు. వన్ నేషన్, వన్ రేషన్ కార్డు విధానంలోనే పేదలకు లబ్ది చేకూరుతుందని వివరించారు. ప్రతి నెలా 5 కిలోల బియ్యం, కిలో శనగలు ఇస్తామన్నారు.
దీనికితోడు వర్షాకాలం రావడంతో అనేక రకాల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, జలుబు, జ్వరం చుట్టుముడతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు స్వీయ రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. మాస్కులు ధరించడం జీవితంలో ఓ భాగం అన్నంతగా పాటించాలని పిలుపునిచ్చారు.
ఇప్పుడే వార్తల్లో చూశానని, ఓ దేశానికి ప్రధానమంత్రి మాస్కు ధరించలేదని ఆయనకు రూ.13 వేల జరిమానా విధించారని తెలిసిందని వెల్లడించారు. బల్గేరియా ప్రధాని బోయికో బోరిస్సావ్ మాస్కు లేకుండా ఓ చర్చిలో అడుగుపెట్టడంతో ఆయనపై జరిమానా విధించారు. ఈ విషయాన్నే మోడీ ప్రస్తావించారు. గ్రామ సర్పంచి అయినా, దేశ ప్రధాని అయినా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
లాక్డౌన్‌తో లక్షల ప్రాణాలు కాపాడగలిగామని, కరోనాతో పోరాడుతూనే ఇప్పుడు అన్‌లాక్ 2.0 లో ప్రవేశించామని మోడీ వెల్లడించారు. ముఖ్యంగా భారత్‌లో 130 కోట్ల మంది ఆరోగ్యంతో కూడిన అంశం కావడంతో నిబంధనలు పాటించడం అత్యావశ్యకం అని అన్నారు. నిబంధనలు పాటించనివారి ఆలోచనా దృక్పథంలో మార్పు తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. కంటైన్మెంట్ జోన్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని స్పష్టం చేశారు.