శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (09:32 IST)

చెన్నై - కొచ్చిన్‌లలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన!

త్వరలోనే ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళలు ఉన్నాయి. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ రాష్ట్రాలపై దృష్టిసారించారు. ఇందులోభాగంగా ఆయన ఆదివారం ఈ రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి చెన్నైకు వచ్చి, ఆ తర్వాత కొచ్చిన్‌కు వెళతారు. 
 
కాగా, ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. తమిళనాడులో ఉదయం 11.15 గంటలకు పలు కీలక ప్రాజెక్టులకు పునాది రాయి వేసి, చెన్నై వద్ద అర్జున్‌ మెయిన్‌ బాటిల్‌ ట్యాంక్‌ (ఎంకే-1ఏ) ఆర్మీకి అప్పగించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:30 గంటలకు కొచ్చిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు, మరికొన్నింటిని జాతికి అంకితం చేస్తారని పీఎంఓ తెలిపింది. 
 
ఈ రెండు రాష్ట్రాల పర్యటనలో ప్రధాని చెన్నై మెట్రో రైలు దశ-1 పొడిగింపును ప్రధాని ప్రారంభించనున్నారు. చెన్నై బీచ్ - అత్తిపట్టు మధ్య నాల్గో రైల్వేలైన్‌, విల్లుపురం - కడలూరు - మాయిలాదుత్తురై - తంజావూర్, మాయిలాదుత్తురై - తిరువారూర్లలో సింగిల్ లైన్ రైల్వే విద్యుద్దీకరణ, గ్రాండ్ అనికట్ కెనాల్ వ్యవస్థ విస్తరణ, ఆధునికీకరణకు పునాది రాయి వేయనున్నారు.
 
అదేవిధంగా, ఐఐటీ మద్రాస్‌ డిస్కవరీ క్యాంపస్‌కు కూడా పునాది రాయివేస్తారు. 2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో మొదటి దశలో రూ.1,000 కోట్ల వ్యయంతో చెన్నై సమీపంలోని తాయూర్ వద్ద క్యాంపస్ నిర్మించనున్నారు. 
 
ఇకపోతే, కేరళ పర్యటనలో, ప్రధాన మంత్రి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపీసీఎల్) ప్రొపైలిన్ డెరివేటివ్ పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ (పీడీపీపీ)ను దేశానికి అంకితం చేస్తారు. కొచ్చిన్‌లోని విల్లింగ్‌డన్‌ దీవుల్లో రో-రో వెస్సల్స్, కొచ్చిన్ పోర్టులో అంతర్జాతీయ క్రూయిస్ టెర్మినల్ ‘సాగరికా’.. మెరైన్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌, విజ్ఞాన సాగర్, కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, కొచ్చిన్ పోర్టులో సౌత్ కోల్ బెర్త్ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.