15 తర్వాత మోగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా!
దేశంలో మరో ఐదు రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో అత్యంత కీలకంగా భావిస్తున్న వెస్ట్ బెంగాల్, తమిళనాడుతో పాటు.. చిన్న రాష్ట్రాలైన కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలకు ఈ నెల 15వ తేదీన తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
ప్రస్తుతం ఎన్నికల సన్నద్ధతను తెలుసుకునేందుకు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో పర్యటించనుంది. ఈ నెల 15 నాటికి పర్యటనను పూర్తి చేయనుంది. ఆ పర్యటన పూర్తి కాగానే ఈ నెల 15 తర్వాత నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని ఈసీ వర్గాలు చెప్పాయి.
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని వెల్లడించాయి. పశ్చిమబెంగాల్‌లో ఆరు నుంచి 8 దశలు, అస్సాంలో రెండు నుంచి మూడు దశల్లో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి.
అన్ని రాష్ట్రాల ఎన్పికల ఫలితాలనూ ఒకే రోజు వెల్లడిస్తారని తెలిపాయి. పది, ఇంటర్ పరీక్షలు మొదలయ్యే మే 1 లోపు అన్ని ఎన్నికలనూ పూర్తి చేయాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం.
కాగా, ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్లు సుశీల్ చంద్ర, రాజీవ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పర్యటించి, ఎన్నికల సంసిద్ధతను తెలుసుకోనున్నారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్, అస్సాంలో ఇప్పటికే వారు పర్యటించారు.