సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 జనవరి 2021 (14:30 IST)

సుప్రీంకోర్టు డెడ్‌లైన్ : రాజీవ్ దోషుల విడుదలకు ఓకే.. గవర్నర్ ఏం చేస్తారో?

మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసులో ముద్దాయిలుగా తేలి జైలుశిక్షను కూడా పూర్తిగా అనుభవించిన దోషుల విడుదలకు సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించింది. ఈ పరిస్థితుల్లో ఆ నిందితుల విడుదలకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది. అయితే, తుది నిర్ణయం మాత్రం రాష్ట్ర గవర్నరు తీసుకోవాల్సివుంది. 
 
శనివారం సమావేశమైన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం రాజీవ్‌ హత్యకేసు దోషులు మురుగన్, నళిని, పేరరివాలన్ సహా ఏడుగురిని విడుదల చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీనిపై ఆ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ స్పందించారు. 
 
రాజీవ్ ముద్దాయిల విడుదలకు సంబంధించి ఉన్న చిక్కుముడులు, మార్గాలపై రాజభవన్‌లో న్యాయనిపుణులతో సుదీర్ఘంగా చర్చించారు. రాజీవ్ దోషుల విడుదలకు సంబంధించి గవర్నర్ రేపు (సోమవారం) తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.
 
కాగా, తనను విడుదల చేయాలని కోరుతూ పేరరివాలన్ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. దానిపై జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. దోషుల విడుదలపై నాలుగైదు రోజుల్లో గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపారు. 
 
దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం ఏ నిర్ణయం తీసుకున్నది వారం రోజుల్లోగా తెలపాలని సూచించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ కార్యదర్శి విష్ణు ఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు, న్యాయనిపుణులతో చర్చించారు. తాజాగా, న్యాయనిపుణులతో చర్చించిన గవర్నర్ భన్వరీలాల్ సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.