మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2019 (15:19 IST)

అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం... పరామర్శించిన రాష్ట్రపతి

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత కొన్ని రోజులుగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 9వ తేదీన ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

కిడ్నీ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటూ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈనెల 9న ఆస్పత్రిలో చేరిన జైట్లీకి సీనియర్‌ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. 
 
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న జైట్లీని... రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌,  కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ శుక్రవారం ఉదయం జైట్లీని  పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వాకబు చేశారు. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వైద్య వర్గాల సమాచారం. 
 
ఇదిలావుండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఆయన ఆర్థిక మంత్రిగా, కొంతకాలం రక్షణ శాఖ ఇన్‌ఛార్జ్ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో మోడీ సర్కారు తీసుకున్న అనేక కీలక నిర్ణయాల్లో జైట్లీ భాగస్వామ్యం ఉంది. ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు, జన్‌ధన్ ఖాతాల ప్రారంభం వంటి అంశాల్లో జైట్లీ కీలకంగా వ్యవహరించారు. 
 
ఈ నేపథ్యంలో 66 యేళ్ళ జైట్లీ... అనారోగ్య కారణాలతో 2019 లోక్‌సభ ఎన‍్నికల్లో పోటీ చేయలేదు. ఈ యేడాది ఫిబ్రవరిలో జైట్లీ వైద్య చికిత్స నిమిత్తం అమెరికాలో ఉండటంతో పీయూష్‌ గోయల్‌ ఆయన స్ధానంలో​ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మోడీ ప్రభుత్వం రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం తన ఆరోగ్య పరిస్థితి సహకరించనందున తాను ప్రభుత్వంలో, క్యాబినెట్‌లో ఎలాంటి బాధ్యత నిర్వహించలేనని అరుణ్‌ జైట్లీ ప్రధానికి లేఖ రాసి, పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు.