శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 23 మార్చి 2020 (22:20 IST)

ప్రత్యేక పెరోల్​పై బయటకు రానున్న ఖైదీలు!

దేశవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తోన్న సమయంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక దూరం పాటించేందుకు వీలుగా జైళ్లలో ఉన్న ఖైదీలకు స్పెషల్​ పెరోల్​ ఇవ్వాలని నిర్ణయించి.. ఇందుకు అనుమతించాలని దిల్లీ హైకోర్టుకు విన్నవించింది. దేశంలో క్రమంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్​ నియంత్రించేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో సామాజిక దూరం పాటించేలా జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను బయటకు పంపేందుకు నిర్ణయం తీసుకుంది దిల్లీ సర్కారు. ఈ మేరకు జైళ్లలోని ఖైదీలకు స్పెషల్​ పెరోల్​ ఇవ్వాలని సంకల్పించింది. ఇందుకు అనుమతించాలని దిల్లీ హైకోర్టుకు విన్నవించింది. ఈ ప్రత్యేక పెరోళ్ల నిబంధన.. ఖైదీలకు అమలు చేసేందుకు వీలుగా జైలు నియమాలను సవరించనున్నట్లు జస్టిస్​ హిమా కోహ్లీ, జస్టిస్​ సుబ్రహ్మణ్యం ప్రసాద్​ల ధర్మాసనానికి నివేదించింది కేజ్రీవాల్ సర్కారు.

ప్రస్తుత నిబంధనలకు అదనంగా రెండు అంశాలను చేరుస్తూ సవరణ చేయనున్నట్లు.. కోర్టుకు నివేదించారు దిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది అనూజ్ అగర్వాల్. ఒకరోజులో నోటిఫికేషన్​ జారీ చేయనున్నట్లు చెప్పారు. ఇలాంటి ప్రత్యేక పెరోల్​కు సుప్రీం గతంలో అనుమతించినట్లు న్యాయవాది పేర్కొన్నారు. ఏదైనా అంటువ్యాధి, ప్రకృతి విపత్తు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో 60 రోజుల పెరోల్​ నిబంధన వర్తిస్తుందని అగర్వాల్​ ధర్మాసనానికి గుర్తుచేశారు.