సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (09:06 IST)

పరువు నష్టం దావా కేసు : హైకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

rahul gandhi
పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. మోడీ ఇంటి పేరును కించపరిచారనే పరువు నష్టం కేసులో రాహుల్ ఈ తాజా పిటిషన్‌ను దాఖలు చేశారు. తనకు విధించిన శిక్షను వాయిదా వేయాలన్న అభ్యర్థనను కింది కోర్టు తిరిస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. గత 2019లో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోడీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 
 
దీనిపై గుజరాత్‌కు చెందిన బీజేపీ నేత పూర్ణేష్ మోడీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేయగా, కేసును విచారించిన కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చి రెండేళ్ల జైలుశిక్షను విధించింది. దీంతో రాహుల్ గాంధీపై లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటువేసింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో రాహుల్ తన అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేశారు. 
 
సూరత్ కోర్టు తనకు విధించిన రెండేళ్ళ జైలుశిక్షను నిలుపుదల చేయాలంటూ ఆయన సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏప్రిల్ 3న విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణలో భాగంగా ఏప్రిల్ 13న ఇరు పక్షాల వాదనలు ఆలకించిన కోర్టు పిటిషన్లను తిరస్కరించింది. దీంతో రాహుల్ హైకోర్టును ఆశ్రయించారు.