1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 13 ఏప్రియల్ 2023 (08:19 IST)

రాహుల్ గాంధీకి మరిన్ని చిక్కులు.. మరో కోర్టు నోటీసులు

rahul gandhi
మోడీఇంటి పేరు వ్యాఖ్యల వివాదంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఇప్పట్లో చిక్కులు వీడేలా కనిపించడంలేదు. ఈ వివాదంలో ఇప్పటికే గుజరాత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలుశిక్షను విధించింది. ఇపుడు మరోకోర్టు ఆయనకు నోటీసులు జారీచేసింది. ఇదే వివాదంపై బీహార్ రాష్ట్రంలోని పాట్నా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ కేసు విచారణకు ఈ నెల 25వ తేదీన రావాలని రాహుల్‌కు తాజాగా సమన్లు జారీ చేసింది.
 
భాజపా రాజ్యసభ ఎంపీ సుశిల్‌ కుమార్‌ మోదీ... రాహుల్‌పై ఈ పరువు నష్టం దావా వేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన పట్నాలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు.. ఏప్రిల్‌ 12న రాహుల్‌ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, ప్రస్తుతం సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌ వ్యవహారంలో తాము బిజీగా ఉన్నందున విచారణ వాయిదా వేయాలని రాహుల్ న్యాయవాదుల బృందం కోర్టును కోరింది. 
 
ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం.. ఏప్రిల్‌ 25వ తేదీకి విచారణ వాయిదా వేసింది. ఆ రోజున రాహుల్‌ వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీల గురించి 2019 ఎన్నికల ప్రచారం వేళ కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ ప్రస్తావించారు. 
 
ఆ సందర్భంగా మోదీ అనే పేరు గురించి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ గుజరాత్‌లోని సూరత్‌లో పరువునష్టం దావా దాఖలైంది. దీనిపై ఇటీవల విచారణ జరిపిన సూరత్‌ కోర్టు.. రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన 24 గంటల్లోపే ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనల మేరకు లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటువేసింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. కాగా.. సూరత్‌ కోర్టు తీర్పుపై రాహుల్‌ పై కోర్టులో అప్పీల్‌ చేసుకున్నారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఏప్రిల్‌ 13న విచారణ జరపనుంది.