ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని పెళ్లి ... పరీక్షలో ఫెయిల్ కావడంతో వేధింపులు
తనకు కాబోయే భార్యకు తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని నమ్మి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తీరా ఆ యువతి పరీక్షలో ఫెయిల్ అయింది. దీంంతో ఆ భర్త తలోని కర్కశత్వాన్ని బయటపెట్టాడు. ఉద్యోగం రాకపోవడంతో భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. చివరకు ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని జూంఝునూ జిల్లాలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జూంఝునూ జిల్లాకు చెందిన ఉషా కుమారి (29) 2013లో రాజస్థాని అడ్మినిస్టేటివ్ సర్వీసెస్ (ఆర్ఏఎస్) పరీక్షలు రాసింది. ప్రిలిమ్స్ పాసైంది. 2015లో ఈ ఫలితాలు వచ్చిన తర్వాత ఆమెకు 2016లో చెందిన వికాస్(35) పెళ్లయింది. పెళ్లి తర్వాత డిసెంబరులో మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. ఆ పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత ఆమె జీవితం తలకిందులైంది.
మెయిన్స్‌లో ఉష ఫెయిలైందని తెలిసిన మెట్టినింటి వారు ఆమెకు నరకం చూపించడం ప్రారంభించారు. పది లక్షల రూపాయలు వరకట్నం తీసుకురావాలంటూ ఆమెను హింసించడం మొదలుపెట్టారు. అప్పటివరకూ రాముడిలా ఉన్న భర్త.. సడెన్‌గా మద్యం తాగి వచ్చి ఉషను చావబాదడం ప్రారంభించాడు.
వేరే ఉద్యోగాలకు పరీక్ష రాయడానికి ఆమె ప్రయత్నాలు మొదలు పెట్టడంతో ఆమెను మరింత నిందించసాగారు. ఈ క్రమంలో తాజాగా ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఉష అత్తమామలు, ఆమె భర్త వికాస్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.