శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలి... లారెన్స్ బిష్ణోయ్ గ్రూపు వార్నింగ్

salman khan
బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుల నుంచి మరోమారు బెదిరింపులు వచ్చాయి. ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీసులకు చెందిన వాట్సాప్ గ్రూపుకు మెసేజ్ పంపించారు. సల్మాన్ ప్రాణాలతో ఉండాలంటే ఈ డబ్బు ఇవ్వాల్సిందేనంటూ అగంతకులు తమ డిమాండ్‌లో పేర్కొన్నారు. 
 
"ఈ బెదిరింపులను ఎట్టిపరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోవద్దు. సల్లూ భాయ్ ప్రాణాలతో ఉండాలన్నా, లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో వైరానికి శాశ్వత ముగింపు పలకాలన్నా ఆయన రూ.5 కోట్లు ఇవ్వాలి. ఈ నగదు ఇవ్వకుంటే మాజీ ఎమ్మెల్యే బాబా సిద్దిఖీ కంటే దారుణమై నపరిస్థితులు చూడాల్సి వస్తుంది" అని ఆ సందేశంలో పేర్కొన్నారు. 
 
మరోవైపు, ఈ బెదిరింపులపై దర్యాప్తు చేస్తున్నట్టు ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ మెసేజ్ ఎక్కడ నుంచి వచ్చిందన్న విషయంపై వారు విచారణ జరుపుతున్నారు. కాగా, ఇటీవల సల్మాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి బాబా సిద్దిఖీని లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులు ముంబైలో కాల్చి చంపిన విషయం తెల్సిందే. కృష్ణ జింక వేటాడి చంపిన కేసు నుంచి ఈ ముఠా సల్మాన్ ఖాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తూనేవుంది.