శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2024 (19:32 IST)

మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని కాల్చి చంపింది మేమే...

baba siddhique
మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీను హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అధికారికంగా ప్రకటించింది. శనివారం రాత్రి ముంబైలో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో సిద్ధిఖీ తీవ్రంగా గాయపడి, లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెల్సిందే. కాగా బాబా సిద్ధిఖీని చంపింది తామేనంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. అదేసమయంలో ఈ హత్య కేసులో ముంబై నగర పోలీసులు ఇప్పటివరకు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
సిద్ధిఖీని హత్య చేసేందుకు నెల రోజులుగా రెక్కీ నిర్వహించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కృష్ణ జింకను వేటాడినప్పటి నుంచి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసుకున్న విషయం తెల్సిందే. ఇపుడు ఆయన సన్నిహితుడుని హత్య చేసిన నేపథ్యంలో సల్మాన్ ఖాన్ భద్రతపై ఆందోళన నెలకొంది. దాంతో ముంబైలోని సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భద్రతను పెంచారు. 

బాబా సిద్ధిఖీ హత్యకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధికార వర్గాల సమాచారం మేరకు.. పదిహేను రోజుల క్రితమే బాబా సిద్ధిఖీని చంపేస్తామంటూ హెచ్చరికలు వచ్చాయి. దీంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించగా.. అధికారులు ఆయన సెక్యూరిటీని పెంచి వై కేటగిరి రక్షణ కల్పించారు. సిద్ధిఖీ హత్యకు దుండగులు 9.9 ఎంఎం పిస్టల్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి ఈ హత్య కాంట్రాక్ట్ కిల్లింగ్ కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.