పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమం
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయన ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రతన్ టాటా ముంబై ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారని పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఐతే అక్టోబర్ 7న, ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో రతన్ టాటా తనకు ఇప్పుడు 86 ఏళ్లనీ, ఆరోగ్య సమస్యలను తనిఖీ చేయించుకునేందుకు ఆసుపత్రికి వచ్చినట్లు వెల్లడించారు.
"నా వయస్సు సంబంధిత పరిస్థితుల కారణంగా నేను ప్రస్తుతం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను" అని రతన్ టాటా X లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. "ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను ఉత్సాహంతో ఉన్నాను," అని చెప్పారు, "తప్పుడు సమాచారంను నమ్మొద్దు'' అంటూ ప్రజలను, మీడియాను అభ్యర్థించారు. కాగా ఆయనకు రక్తపోటు తగ్గడంతో సోమవారం తెల్లవారుజామున ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు.
రతన్ టాటా మార్చి 1991లో టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 28, 2012న పదవీ విరమణ చేశారు. ఆయన పదవీ కాలంలో టాటా గ్రూప్ ఆదాయాలు అనేక రెట్లు పెరిగాయి, 1991లో కేవలం ₹10,000 కోట్ల టర్నోవర్ నుండి 2011-12లో మొత్తం 100.09 బిలియన్ డాలర్లకు చేర్చారు. ఆయన హయాంలో ఎన్నో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి విజయవంతం చేసి చూపించారు.