బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 7 ఆగస్టు 2021 (18:30 IST)

ప‌ది రాష్ట్రాల్లో ఏ క్షణమైనా ఉప ఎన్నికల షెడ్యూల్

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ కసరత్తు పూర్తి చేసింది. సెప్టెంబర్ రెండు లేదా మూడో వారంలో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఒడిశా, హర్యానా, రాజస్థాన్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉపఎన్నికలు జరగాల్సి ఉంది.
 
అలాగే, రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంద‌ని ఈసీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఏపీలో బద్వేల్, తెలంగాణ లో హుజురాబాద్ స్థానాలకు ఉప ఎన్నిక‌లు జరగాల్సి ఉంది. ఏపీలో 3, తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.
 
ఈసీ షెడ్యూల్ సమాచారం తెలియడంతో ఇప్పటికే తెలంగాణ హుజురాబాద్ లో రాజకీయ వేడి మొద‌లై పోయింది. కోవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపద్యంలో ఉప ఎన్నికల నిర్వహణ విషయంలో ఈసీ ఆచితూచి వ్యవహరిస్తోంది. గతంలో బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సందర్భంగా కోవిడ్ కేసులు పెరగడంతో కోర్టుల నుంచి ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్రశ్నలు ఎదుర్కొంది. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, ఎన్నికల నిర్వహణ కాలపరిమితి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని షెడ్యూల్ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
రాష్ట్రాల్లో పాజిటివిటి రేటు, నియోజకవర్గాల్లో పోలింగ్ బూతుల ఏర్పాటు, నకిలీ ఓట్ల గుర్తింపు, ఎన్నికల సన్నద్దత  అంశాల ఆధారంగా ఉప ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో యుపి, ఉత్తరాఖండ్ లో అసెంబ్లీ ఉప ఎన్నికలలు లేనట్లే అని ఎన్నిక‌ల వ‌ర్గాలు చెపుతున్నాయి.
 
బెంగాల్ లో దీదీ మ‌మ‌తా బెన‌ర్జీకి ఉప ఎన్నికల షెడ్యూల్ టెన్షన్ పుట్టిస్తోంది. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలపై నేడు మరో సారి సీఈసీని టీఎంసీ నేతల బృందం కలవనుంది. బెంగాల్ లో 7 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఈసీని టీఎంసీ బృందం కొరనుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోయినా ముఖ్యమంత్రిగా ఉన్నమమతా బెనర్జీ, నవంబర్ 4 లోపు ఉప ఎన్నిక జరిగి, గెలుపోందితేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.