గ్రేట్ టీచర్.. విద్యార్థుల కోసం నగలు అమ్మి...
ఉదయాన్నే స్కూలుకొచ్చి.. నాలుగు ముక్కలు పిలల్లకి భోదించి.. సాయంత్రం టైంకి ఇంటికెళ్లిపోవడం. ఇదీ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చాలా మంది ఉపాధ్యాయులు చేసే పని. వారు తీసుకుంటున్న జీతానికి న్యాయం చేస్తూ.. పిల్లలకి పాఠ్యపుస్తకాల్లో ఉన్న పాఠాలను నేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సక్రమంగా పాఠాలు చెప్తే చాలు ఆ టీచర్‌ని నెత్తిన పెట్టుకుంటారు. కానీ తమిళనాడులోని ఓ ఉపాధ్యాయురాలు గురించి తెలుసుకుంటే ఆమెను నెత్తిన పెట్టుకోవడం కాదు.. అభినందనలతో ముంచెత్తుతారు.....
ఫోటోలో చూస్తున్న ఈమె పేరు. అన్నపూర్ణ మోహన్. తమిళనాడులోని కంధాడు అనే ప్రాంతంలో ఉన్న పంచాయత్ యూనియన్ ప్రైమరీ స్కూల్ (పీయూపీఎస్) ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే అన్నపూర్ణ అందరి ప్రభుత్వ ఉపాధ్యాయుల్లా కాదు. ఆమె విద్యార్థులకు బోధించే శైలి వినూత్నంగా ఉంటుంది.
అచ్చం అంతర్జాతీయ పాఠశాలల్లో విద్యార్థులకు బోధించే పద్ధతిలోనే ఈమె విద్యార్థులకు ఇంగ్లిష్ పాఠాలు చెబుతారు. అయితే అందుకు గాను ఆ పాఠశాలలో సరైన పరికరాలు లేవు. దీంతో ఆమె విద్యార్థులతో ఇంగ్లిష్ పద్యాలు, పాటలు పాడిస్తూ వాటిని వీడియోలు తీయడం ప్రారంభించారు. అనంతరం ఆ వీడియోలను ఆమె తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు.
దీంతో ఆమె ప్రయత్నాన్ని అభినందిస్తూ కొందరు స్వచ్ఛందంగా డబ్బులు పంపడం మొదలు పెట్టారు. ఆ వీడియోలను అమెరికా, సింగపూర్‌లలో ఉన్న పలువురు ఎన్ఆర్ఐలు కూడా చూశారు. దీంతో వారు కూడా తమకు చేతనైనంత సహాయం చేయడం మొదలు పెట్టారు. అలా వచ్చే డబ్బుతో అన్నపూర్ణ ఆ విద్యార్థులకు కావల్సిన పరికరాలు, పుస్తకాలు కొనేవారు.
అయితే ఎవరో సహాయం చేయగా లేనిది తానే ఆ విద్యార్థులకు ఎందుకు చేయూతనందించకూడదు..? అని ఆమె ఆలోచించారు. ఈ క్రమంలోనే ఆమె తన నగలు అమ్మి వాటితో వచ్చిన డబ్బును ఆ విద్యార్థుల కోసం ఉపయోగించారు. స్కూల్‌లో అధునాతన డిజిటల్ సిస్టమ్, విద్యార్థులు పాఠాలు నేర్చుకునేందుకు అవసరమయ్యే డిజిటల్ పరికరాలు వంటి వాటిని సమకూర్చారు.
దీంతో విద్యార్థులు చదువుల్లో చక్కగా రాణిస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లలో చదివే పిల్లలు ఇంగ్లిష్ ఎలా మాట్లాడతారో వారు కూడా అలాగే ఇంగ్లిష్‌ను మాట్లాడడం మొదలు పెట్టారు. ఇదంతా టీచర్ అన్నపూర్ణ మోహన్ చలవే అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.