పోలీస్ స్టేషన్ కు తరలించిన విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలి
ఆంధ్రప్రదేశ్ లో విద్యను ప్రయివేటు పరం చేసే కుట్రను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
అనంతపురంలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ చెప్పారు. ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ, శాంతియుత నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ అమానుషమన్నారు.
విలీనం పేరుతో ఎయిడెడ్ విద్యా రంగాన్ని ప్రైవేటుపరం చేస్తే ఫీజులు అధికమవడం ఖాయం అని, అందుకే తాము దీనిని వ్యతిరేకిస్తున్నామన్నారు. దశలవారీగా విద్యా రంగాన్ని ప్రైవేటుపరం చేసే రాష్ట్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని విద్యార్థి లోకానికి పిలుపునిస్తున్నామన్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించిన విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలని రామకృష్ణ డిమాండు చేశారు.