శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 5 నవంబరు 2021 (14:01 IST)

మానవత్వం చాటుకున్న మచిలీపట్నం రాబర్ట్ స‌న్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్

పోలీసులు అంటే కేవలం రక్షణ కల్పించడమే కాదు, మానవత్వాన్ని కూడా చాటుతారు.  ఎవరికి ఏ ఆపద వచ్చినా మేమున్నామంటున్న పోలీసు అధికారులు తమదైన శైలిలో సామాన్యులకు కూడా సాయం చేస్తున్నారు. 

 
మద్యం సేవించి రోడ్లపైకి రావొద్దంటే, మందుబాబులు అసలే వినడం లేదు. ఫుల్‌గా మద్యం సేవించి బిజీగా ఉండే రోడ్లపై ఇష్టారీతిన నడుస్తున్నారు. మత్తు మోతాదు ఎక్కువై మరికొందరు నడి రోడ్లపై ప‌డి నిద్రపోతున్నారు. మచిలీపట్నం రాబర్ట్ స‌న్ పేట  పోలీస్‌ సర్కిల్ ఇన్స్పెక్టర్  రుద్రరాజు భీమరాజు  శుక్రవారం ఉదయం స్థానిక బస్టాండ్ కూడలి ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో  ఓ వ్యక్తి రోడ్డుపై ప‌డి ఉండ‌టాన్ని గ‌మ‌నించారు. తన వ్యక్తిగత బలహీనత కారణంగా పూటుగా మద్యం సేవించి, నడి రోడ్డుపై స్పృహ లేకుండా పడి  ఉన్నాడా వ్య‌క్తి. వివిధ వాహనాలు ఆ వ్యక్తికి అత్యంత సమీపం నుంచి ప్రయాణిస్తున్నాయి. వాహనచోదకులు ఎవరైనా పరధ్యానంగా ఉండి, రోడ్డు మధ్యలో ఉన్న వ్యక్తిని గమనించకపోతే, ఏదైనా ఘోరం జరిగే అవకాశం ఉంది.  

 
విధి నిర్వహణలో భాగంగా ఆ మార్గంలో వెళుతున్న సి ఐ ఆ వ్యక్తి  పరిస్థితి గమనించి, మొఖంపై నీళ్లు చల్లి లేపి కూర్చోబెట్టారు. ఆ తర్వాత నీళ్లు తాగించి, స్వయంగా భుజం పట్టి పైకి లేపి, రోడ్డు దాటించి  ఒక పక్కన కూర్చోబెట్టారు. ఆ వ్యక్తి వివరాలు, కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్ తీసుకొని ఆ వ్యక్తి పరిస్థితిని  తెలియచేసి క్షేమంగా ఇంటికి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఖాకీలు అంటే కర్కశత్వమే అని కొంద‌రు ప‌లికే మాట‌లు నిజం కాదని, తమకు మనసు ఉంటుందని చేతల్లో చేసి చూపుతున్న ఇటువంటి పోలీస్ అధికారులు ప్రజలలో నమ్మకాన్ని పెంచుతున్నారు.