ఢిల్లీ నుంచి శ్రామిక్ రైళ్లు బంద్
వలసకార్మికులను తరలించేందుకు నియమించిన ప్రత్యేక శ్రామిక్ రైళ్లను ఢిల్లీ ప్రభుతం నిలిపేసింది. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో అధికమంది వలస కార్మికులు వెళ్లేందుకు ఇష్టపడటం లేదని తెలిపింది.
ఢిల్లీ నుండి చివరి శ్రామిక రైలు బీహార్ వెళేందుకు ఆదివారం బయలుదేరనుందని రైల్వే శాఖ ఉన్నతాధికారి తెలిపారు. నమోదు చేసుకున్న వారినే కాకుండా, రిజిస్ట్రేషన్ లేకుండా వచ్చిన వారిని కూడా ఈ ప్రత్యేక రైళ్లలో తమ ప్రాంతాలకు తరలించామని, ఇక శ్రామిక రైళ్లు ఉండవని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు.
ప్రత్యేక రైళ్లు నడపాలంటూ తక్కువ మంది వలసదారుల నుండి మాత్రమే అభ్యర్థనలు వస్తున్నాయని అన్నారు. గణాంకాల ప్రకారం.. దరఖాస్తు చేసుకున్న 4,50 వేల మంది వలసకార్మికుల్లో 3,10,వేలమందిని 16 రాష్ట్రాలకు 237 ప్రత్యేక శ్రామిక రైళ్లలో ఉచితంగా తరలించామని, ఈ రైళ్లలో 90 శాతం రైళ్లు ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు.
మిగిలినవి మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశాకు వెళ్లాయని, తమిళనాడుకు ఒక రైలు ప్రయాణించిందని అదికారులు తమ నివేదికలో పేర్కొన్నారు.