కరోనా సోకి మాజీ అటార్నీ జనరల్ సొలి సొరాబ్జీ మృతి
దేశంలో మరణ మృదంగం కొనసాగిస్తున్న కరోనా వైరస్... ఇపుడు మరో ప్రముఖుడిని బలితీసుకున్నది. మాజీ అటార్నీ జనరల్, పద్మవిభూషణ్ సొలి జహంగీర్ సొరాబ్జీ కరోనా వైరస్ సోకి కన్నుమూశారు.
91 ఏండ్ల వయస్సున్న ఆయనకు కరోనా నిర్ధారణ కావడంతో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
సొలి సొరాబ్జీ 1930లో ముంబైలో జన్మించారు. 1953లో బాంబే హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1971లో సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్‌గా గుర్తించింది. తర్వాత కొంతకాలానికి ఆయన అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు. మొదటిసారి 1989-90, రెండోసారి 1998-2004 వరకు ఏజీఐగా వ్యవహరించారు.
మరోవైపు, బాలీవుడ్ ప్రముఖ నటుడు రణధీర్ కపూర్‌కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ అని తెలియగానే అందరిలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం 74 ఏళ్ల రణధీర్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరు కంగారు పడొద్దని వైద్యులు చెబుతున్నారు. తనతో పాటు తన స్టాఫ్ ఐదుగురికి కరోనా సోకిందని తెలియజేసిన రణధీర్ ముందస్తు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరారని అంటున్నారు.
తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అంటున్న రణధీర్ ఆక్సీజన్ సాయం కూడా తీసుకోవట్లేదని పేర్కొన్నారు. రణధీర్ ఇటీవలే రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు
రాజ్ కుమార్ తనయుడు అయిన రణ్‌ధీర్ కపూర్ గత ఏడాది ఏప్రిల్ 30న తన సోదరుడు రిషీ కపూర్‌ను కోల్పోయాడు. రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడిన రిషి ఏప్రిల్ 30న కన్నుమూశారు.
ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 9న రణధీర్ చిన్న తమ్ముడు రాజీవ్ కపూర్ మరణించారు. 1971లో వచ్చిన కల్ ఆజ్ అవుర్ కల్ చిత్రంతో రణధీర్ హీరోగా పరిచయం అయ్యారు. చివరిగా హౌజ్‌ఫుల్ 2 అనే చిత్రంలో నటించారు.