బాలికలను దుస్తులపై నుంచి తాకడం వేధింపు కాదా? బాంబే హైకోర్టుకు సుప్రీం షాక్
బాలికల దుస్తులు తాకడం కూడా లైంగిక వేధింపుల కిందకే వస్తుంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోక్సో చట్టం ప్రకారం దుస్తుల మీద నుంచి బాలికల శరీర భాగాలను తాకితే లైంగిక వేధింపుల కిందకు రాదని గతంలో బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని సుప్రీంకోర్టు తాజాగా కొట్టివేసింది.
గత 2016లో సతీష్ అనే ఓ వ్యక్తి ఓ బాధిత బాలికకు పండ్ల ఆశ చూపి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలిక చాతిని తాకి ఆమె దుస్తులు విప్పడానికి ప్రయత్నించాడు. ఆ బాలిక కేకలు వేయడంతో ఆమె తల్లి అక్కడకు వచ్చి జరిగిన విషయం తెలుసుకుంది. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
ఈ కేసు విచారణ మహారాష్ట్రలో జరుగగా, దిగువ కోర్టు నిందితుడిని పోక్సో చట్టం కింద దోషిగా తేల్చింది. ఆ తర్వాత నిందితుడు హైకోర్టుకు వెళ్లగా, అక్కడ తద్విరుద్ధమైన తీర్పు వెలువడింది. పోక్సో చట్టం ప్రకారం దుస్తులపై నుంచి తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదన్నట్టుగా తీర్పునిచ్చింది. ఈ కేసును సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా, అక్కడ సంచలన తీర్పు వెలువరించింది. బాలిక దుస్తులపై నుంచి తాకడం కూడా వేధింపుల కిందకే వస్తుందని స్పష్టం చేసింది.