ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 29 ఫిబ్రవరి 2024 (17:45 IST)

ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు : సమర్థించిన సుప్రీం

kids
ప్రభుత్వ ఉద్యోగాలకు ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు అనర్హులంటూ రాజస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. నిజానికి గత కొన్నేళ్లుగా ఈ చట్టం అమల్లో వుంది. ఈ నిబంధనను తాజాగా సుప్రీంకోర్టు కూడూ సమర్థించింది. ఇందులో ఎలాంటి వివక్షగానీ, రాజ్యాంగ ఉల్లంఘనగానీ లేదని తెలిపింది. ఈమేరకు దీన్ని సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
 
రాజస్థాన్‌ పోలీస్‌ సబ్‌ఆర్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌, 1989 ప్రకారం.. జూన్‌ 1, 2002 తర్వాత ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది సంతానం కలిగిన అభ్యర్థులు నియామకాలకు అనర్హులు. ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఈ 'ఇద్దరు పిల్లల' నిబంధనను అమలుచేస్తూ రాజస్థాన్‌ వేరియస్‌ సర్వీస్‌ రూల్స్‌ చట్టానికి 2001లో సవరణలు చేశారు. 
 
దీన్ని ఆ రాష్ట్రానికి చెందిన రామ్‌జీ లాల్‌ జాట్‌ గతంలో సైన్యంలో పనిచేసి 2017లో పదవీ విరమణ పొందారు. అనంతరం కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం 2018లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, రామ్‌జీకి ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉండటంతో ఆయన దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను 2022లో రాజస్థాన్‌ హైకోర్టు కొట్టివేసింది. ఇది విధానపరమైన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. 
 
దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. 'ఇద్దరు పిల్లల' నిబంధనను సమర్థించింది. 'ఇందులో ఎలాంటి వివక్ష లేదు. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ నిబంధన రాజ్యంగ ఉల్లంఘన కిందకు రాదు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల కోసం ఈ రూల్‌ తీసుకురాగా మేం దాన్ని ఆమోదించాం' అని గుర్తు చేస్తూ, ఈ పిటిషన్‌‍ను కొట్టివేస్తున్నట్టు తెలిపింది.