గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (08:26 IST)

మహిళల పట్ల మతపరమైన వివక్షపై సుప్రీం ప్రశ్నాపత్రం

వివిధ మతాల్లో మహిళలపై వివక్షను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తాము సంధించాల్సిన ప్రశ్నలను రూపొందించే ప్రక్రియను ప్రారంభించింది సుప్రీంకోర్టు.

శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం అంశాన్ని ఇప్పుడు పరిశీలించడం లేదని తెలిపింది. దానిపై ఈనెల 6న నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. వివిధ మతాల్లో మహిళలపై వివక్షను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తాము సంధించాల్సిన ప్రశ్నలను రూపొందించే ప్రక్రియను సుప్రీంకోర్టు ప్రారంభించింది.

ఆయా పిటిషన్లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని 9మంది సభ్యులతో కూడిన ధర్మాసనం... శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని పిటిషన్‌ దాఖలైనా విచారించడం లేదని స్పష్టం చేసింది.

దీనిపై తదుపరి విచారణను ఈనెల 6కు వాయిదా వేసింది ధర్మాసనం. తాము రూపొందించిన అంశాలు, విచారణకు పట్టే కాలవ్యవధిపై సంబంధిత వ్యక్తులకు అదే రోజు వివరిస్తామని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే వారం చేపడతామని స్పష్టం చేసింది.

శబరిమల ఆలయం, మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, దావూది బోరో ముస్లిం వర్గంలో మహిళలకు సున్తీ చేయించడం, ఇతర మతస్థులను వివాహం చేసుకున్న పార్శీ మహిళల హక్కులను హరించడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో 64 పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ అంశంపై గతంలో విచారణ చేపట్టిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. మహిళల వివక్ష అంశాన్ని అతిపెద్ద ధర్మాసనానికి గతేడాది నవంబరు 14న సిఫార్సు చేసింది.