సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 డిశెంబరు 2024 (11:29 IST)

Zakir Hussain ఉస్తాద్ జాకీర్ హుస్సేనే ఇకలేరు... నిర్ధారించిన కుటుంబ సభ్యులు

jakir hussain
Zakir Hussain Dies ప్రపంచ ప్రఖ్యాత తబలా విధ్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఇకలేరు. ఆయన వయసు 73 యేళ్ళు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు సోమవారం అధికారికంగా వెల్లడించారు. గుండె, రక్తపోటు సమస్యల కారణంగా ఆయన మృతిచెందినట్టు వారు ఓ ప్రకటనలో తెలిపారు. 
 
గుండె సంబంధిత సమస్యలతో గత రెండు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తొలుత ఆదివారం రాత్రి ఆయన చనిపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, వాటిని కుటుంబ సభ్యులు ఖండించారు. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఆయన మరణాన్ని ధ్రువీకరించారు.
 
జాకీర్ హుస్సేన్ భార్య ఆంటోనియా మిన్నెకోలా, కుమార్తెలు అనిసా ఖురేషీ, ఇసాబెల్లా ఖురేషీ ఉన్నారు. 1951 మార్చి 9న జన్మించిన ఆయన లెజెండరీ తబలా వాయిద్యకారుడు ఉస్తాద్ అల్లారఖా పెద్ద కుమారుడు. ఇక తబలా మ్యాస్ట్రోగా పేరుగాంచిన జాకీర్ హుస్సేన్ ఏడు సంవత్సరాల వయస్సులోనే తన కెరీర్‌ను ప్రారంభించడం విశేషం. తద్వారా చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచారాయన.
 
హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ప్యూజన్‌లో ప్రావీణ్యం సాధించి సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. ఆయన తన కెరీర్‌లో రవిశంకర్, అలీ అక్బర్ ఖాన్, శివకుమార్ శర్మతో సహా భారతదేశపు దిగ్గజ కళాకారులందరితో కలిసి పనిచేశారు.
 
జాకీర్ హుస్సేన్ తన కెరీర్లో నాలుగు గ్రామీ అవార్డులను అందుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 66వ గ్రామీ అవార్డుల్లో మూడు అవార్డులను కైవసం చేసుకున్నారు. అలాగే భారత ప్రభుత్వం ఇచ్చే దేశ అత్యున్నత పౌర పురస్కారాలు ఆయనను వరించాయి. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషన్లను అందుకున్నారు.