మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 జనవరి 2025 (18:50 IST)

అల్లు అర్జున్‌‌కి పవన్ కళ్యాణ్ పరోక్షంగా పంచ్ ఇచ్చిపడేశారా? (Video)

Ram Charan-Pawan Kalyan
హీరో అల్లు అర్జున్‌కు ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగా పంచ్ ఇచ్చిపడేశారు. రాజమండ్రి వేదికగా శనివారం జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్‌గా మారాయి. "ఈ రోజు పవన్ కళ్యాణ్ ఉన్నా.. రామ్ చరణ్ ఉన్నా.. ఏ హీరోలున్నా.. దానికి మూలం మెగాస్టార్ చిరంజీవినే. నేను మూలాలు ఎప్పటికీ మర్చిపోను" అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 
 
తన కష్టంతోనే పైకొచ్చానంటూ ఈమధ్య వ్యాఖ్యలు చేస్తున్న హీరో అల్లు అర్జున్‌కు కౌంటర్‌గానే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసివుంటారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, గత ఎన్నికల్లో అల్లు అర్జున్ తన స్నేహితుడైన వైకాపా ఎంపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి అల్లు అర్జున్ ఒంటరివాడై పోయాడు. మెగా హీరోలంతా ఒక్కటయ్యారు. 
 
అల్లు అర్జున్‌ను వెనుకేసుకొచ్చిన బోనీ కపూర్ 
 
హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో "పుష్ప-2" ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ స్పందించారు. సంధ్య థియేటర్‌కు ప్రేక్షకులు భారీగా తరలి రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆయన అన్నారు. ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ తప్పేమీ లేదని, బన్నీని నిందించాల్సిన అవసరం లేదని, ఎక్కు మంది జనాలు రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని చెప్పారు. 
 
దక్షిణాది ప్రేక్షకులకు తమ అభిమాన హీరోలపై అభిమానం ఎక్కువగా ఉంటుందన్నారు. తమిళ స్టార్ అజిత్ నటించిన ఒక సినిమాకు అర్థరాత్రి షోకు తాను వెళ్లాలనని, దాదాపు 20 వేలమంది థియేటర్ దగ్గర ఉన్నారని, సినిమా థియేటర్ వద్ద అంతమందిని చూడటం తనకు అదే తొలిసారన్నారు. సినిమా పూర్తయ్యాక తెల్లవారుజామున 4 గంటలకు బయటకు వచ్చినపుడు కూడా అంతే మంది ప్రేక్షకులు థియేటర్ బయట ఎదురు చూస్తున్నారని చెప్పారు. 
 
అగ్ర హీరోలు చిరంజీవి, రజనీకాంత్, రామ్ చరణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి వారు నటించిన చిత్రాలకు ప్రేక్షకులు ఇలాగే వస్తారని బోనీ కపూర్ తెలిపారు. జనాలు ఎక్కువ వచ్చినందుకే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు.