జనసేన పార్టీకి ఇంధనం దిల్ రాజు, నా బంగారం రామ్ చరణ్: డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan Speech రామ్ చరణ్ (Ram Charan), కియారా అద్వానీ జంటగా శంకర్(Shankar) దర్శకత్వంలో దిల్ రాజు(Dil Raju) నిర్మించిన గేమ్ ఛేంజర్ చిత్రం ప్రి-రిలీజ్ (Game changer pre-release) కార్యక్రమం ఆంధ్ర ప్రదేశ్ రాజమహేంద్రవరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిత్ర పరిశ్రమ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు.
తను ఆర్థిక ఇబ్బందుల్లో వున్నప్పుడు తనతో వకీల్ సాబ్ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు గారు తీసారనీ, ఆ డబ్బు జనసేన పార్టీకి ఇంధనంగా మారి ఈనాడు నేనీస్థానంలో వున్నానని గుర్తు చేసుకున్నారు. తను ఏనాడూ మూలాలు మర్చిపోననీ, అలాగే మా కుటుంబంలోని ప్రతి వ్యక్తి అలాగే పెరిగారనీ, గతం తాలూకు మూలాలను ఎప్పటికీ మర్చిపోమని అన్నారు.
ఇక రామ్ చరణ్ గురించి చెబుతూ.. చరణ్ మా బంగారం, నా తమ్ముడు, నాతో కలిసి నా తల్లి గర్భాన జన్మించనప్పటికీ నా సోదర సమానుడు. ఎంత ఎదిగినా ఒదిగి వుండే లక్షణం రామ్ చరణ్‌ది. సంవత్సరం 365 రోజుల్లో 100 రోజులు దైవభక్తిలో వుంటాడు, అయ్యప్ప స్వామి మాలలోనూ, అమ్మవారి పూజలోనూ వుంటాడు. అంతటి శక్తివంతమైన వ్యక్తిత్వం రామ్ చరణ్‌ది. తండ్రి మెగాస్టార్ చిరంజీవి గారి తగ్గ తనయుడు.
మెగాస్టార్ కుమారుడు గ్లోబల్ స్టార్ కాకుండా ఏమవుతాడు. డైరెక్టర్ శంకర్ చిత్రాలు సందేశాత్మకంగా వుంటాయి. గేమ్ ఛేంజర్ కూడా అలాగే వుంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దిల్ రాజు మూడేళ్ల పాటు ఎంతో కష్టపడి ఈ సినిమా తీసారు. మీరంతా చిత్రాన్ని చూసి సంక్రాంతి పండుగకు బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు కొట్టండి" అని అన్నారు.