బుద్గాంలో టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల పెట్రేగిపోతున్నారు. ఈ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 60 మందికిపైగా ఉగ్రవాదులు ఉన్నట్టు కాశ్మీర్ ఐజీ విజయకుమార్ వెల్లడించారు. దీంతో ఈ ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి బుద్గాం జిల్లా చదూరలలో ఓ టీవీ నటిని ఉగ్రవాదులు కాల్చి చంపారు.
బుధవారం రాత్రి 8 గంటల సమయంలో టీవీ నటి అమ్రీన్ భట్ తన మేనల్లుడు ఫర్హాన్ జుబైర్ (10)తో కలిసి ఇంటి బయట ఉండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆమె మరణించగా, బాలుడు గాయపడ్డాడు. దీంతో ఆ బాలుడిని జుబైర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదిలావుంటే బుధవారం బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులతో పాటు ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. తాజాగా కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటరులో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జిల్లాలోని జుమాగండ్ గ్రామంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు కలిసి ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో ముగ్గురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు.