గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 14 నవంబరు 2020 (18:06 IST)

2024 ఎన్నికలపై అప్పుడే కన్నేసిన బీజేపీ, నడ్డా కాలికి బలపం, ఎందుకో తెలుసా?

దేశ వ్యాప్తంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీ... ఏమాత్రం అలసత్వం ప్రదర్శించడం లేదు. 2024 ఎన్నికలకు అప్పుడే రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. మూడున్నరేళ్ల తర్వాత జరిగే లోక్ సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశవ్యాప్త యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. 'రాష్ట్రీయ విస్తృత్ ప్రవాస్' పేరుతో 100 రోజుల పాటు యాత్రను చేపట్టబోతున్నారు. 
 
ఇందులో భాగంగా ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులు పర్యటించాలనే విషయాన్ని సిద్ధం చేశారని సమాచారం. తన యాత్రలో భాగంగా గత ఎన్నికల్లో పరాభవం పొందిన రాష్ట్రాలు, నియోజకవర్గాలపై నడ్డా ఎక్కువ దృష్టి సారించబోతున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ప్రజాప్రతినిధులు, ఇతర నేతలలో భేటీ అవుతారు. పార్టీని పటిష్టం చేయడం, విస్తరించడం, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వంటి వాటిపై చర్చించి, కార్యాచరణను రూపొందించనున్నారు.
 
మరోవైపు కరోనా నేపథ్యంలో నడ్డా యాత్రకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. మీటింగ్ హాళ్లలో 200 మందికి మించకుండా చర్యలు తీసుకోనున్నారు. సమావేశ గదుల వద్ద టెంపరేచర్‌ను పరీక్షించే పరికరాలు, శానిటైజర్లు, మాస్కులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. 
 
నడ్డా చేపట్టబోతున్న యాత్రను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు, సంకీర్ణ ధర్మంతో అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏ-కేటగిరీలో ఉంటాయి. తెలంగాణ, ఏపీ వంటి బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు బీ కేటగిరీలో ఉంటాయి. మేఘాలయ, మిజోరాం వంటి చిన్న రాష్ట్రాలు సీ కేటగిరీలో ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ వంటి రాష్ట్రాలు డీ కేటగిరీలో ఉంటాయి.