శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 8 మే 2021 (15:54 IST)

మేకను చంపేందుకు వచ్చిన సింహాన్ని అడ్డుకున్న యువకుడ్ని పొట్టనబెట్టుకుంది

గుజరాత్ జునాగఢ్ జిల్లాలోని మధుపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తన మామిడి తోటలో మేకలను పెంచుతున్న 35 ఏళ్ల వ్యక్తిని సింహం చంపేసింది.
 
వివరాలు చూస్తే.. జిల్లాలోని మధుపూర్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున 35 ఏళ్ల వ్యక్తిని సింహం చంపినట్లు అటవీ అధికారి తెలిపారు. తెల్లవారుజామున 1 గంటకు గిర్ (పశ్చిమ) అటవీ విభాగంలో తలాలా శ్రేణిలో ఈ సంఘటన జరిగిందని జునాగఢ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్ లైఫ్), దుష్యంత్ తెలిపారు.
 
బాధితుడు బహదూర్భాయ్ జీవాభాయ్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. తన మేకను సింహం నుండి కాపాడటానికి ప్రయత్నించే క్రమంలో అతడు బలయ్యాడు. ఈ సంఘటన తరువాత, సింహాన్ని అటవీ శాఖ సిబ్బంది బృందం పట్టుకున్నట్లు అధికారి తెలిపారు.
 
"జివాభాయ్ మధుపూర్ గ్రామంలోని మామిడి తోట వద్ద ఒక గుడిసె బయట నిద్రిస్తున్నాడు, అక్కడ సింహం చెట్టుకు కట్టేసి వున్న మేకపై దాడి చేయడానికి ప్రయత్నించింది. జివాభాయ్ మేక అరుపులు విని సింహాన్ని చూసాడు. మేకను కాపాడేందుకు సింహం పైకి వెళ్లాడు. అయితే ఆ క్రూర జంతువు అతన్ని చంపేసింది" అని దుష్యంత్ చెప్పారు.