బైక్‌ని లాఠీతో కొట్టి ఓవరాక్షన్ చేసిన ట్రాఫిక్ పోలీస్..
సాధారణంగా మనం బండి నడిపే సమయంలో ఎప్పుడైనా నాన్ పార్కింగ్ ఏరియాలో వెహికల్‌ను పార్క్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తారు..ఫైన్ వేస్తారు లేదంటే బండిని సీజ్ చేస్తారు. మహా అయితే బండిని స్టేషన్‌కి లాక్కెళ్లి పోతారు. కానీ ఇందుకు భిన్నంగా చెన్నై మహానగరంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ట్రాఫిక్ పోలీసు ఓవరాక్షన్ చేసాడు.
బైక్‌ని రోడ్డు మీద పార్క్ చేసాడనే కోపంతో ఊగిపోయాడు. చేతిలో ఉన్న లాఠీతో బైక్‌ను పగలకొట్టాడు. మామూలుగా కొట్టలేదు. బైక్ గ్లాస్ పగలగొట్టాడు, బ్రేక్‌లు విరగొట్టాడు. బైక్ ముందు భాగాన్ని పూర్తిగా ధ్వంసం చేసాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ నిర్వాకం మొత్తం మొబైల్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది.
చెన్నై మెరీనా బీచ్‌లో ఈ ఘటన జరిగింది. ఆ బైక్ ఓ విద్యార్థికి చెందినది. వీఐపీ కాన్వాయ్ వస్తోందనే సమాచారంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. అదే సమయంలో రోడ్డుపై ఓ బైక్ అడ్డంగా కనిపించింది. దీంతో ట్రాఫిక్ పోలీసుకి కోపం వచ్చింది. అంతే ఒక్కసారిగా తన ప్రతాపాన్ని బైక్‌పై చూపించాడు. కానిస్టేబుల్ బైక్‌ను లాఠీతో కొడుతున్న సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఆ దృశ్యాలను మొబైల్లో షూట్ చేసాడు. ఓవరాక్షన్ చేసిన ఆ ట్రాఫిక్ పోలీసుని మోహన్‌గా గుర్తించారు.
అతడొక హోంగార్డు. బైక్ యజమాని వచ్చినా అతడు ఆగలేదు. లాఠీతో బండిని కొడుతూనే ఉన్నాడు. ఆ విద్యార్థి ఏమీ మాట్లాడకుండా బైక్ తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారడంతో ట్రాఫిక్ పోలీస్ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నెటిజన్లు సైతం అతడి ప్రవర్తన పట్ల మండిపడుతున్నారు.
రూ.500 లేదా వెయ్యి రూపాయల ఫైన్‌తో పోయే దానికి బైక్‌ను డ్యామేజ్ చెయ్యడం ఏంటని మండిపడుతున్నారు. ఇప్పుడు ఆ బండిని రిపేర్ చేసుకోవాలంటే వేల రూపాయలు ఖర్చు అవుతుందని, ఆ డబ్బు ఎవరు ఇస్తారు? అని నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. దీనిపై విచారణ చేపట్టారు. సదురు ట్రాఫిక్ పోలీస్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రిపోర్టు రాగానే అతడిని విధుల నుంచి సస్పెండ్ చేస్తామన్నారు.