శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 28 ఫిబ్రవరి 2019 (15:17 IST)

రూ.30లతో 22 కిలోమీటర్లు.. కారులో.. ప్రయాణించవచ్చా..? ఎలా?

దేశంలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వంటి ఇంధనాలను యథేచ్ఛగా వాడడం వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోయింది. దీనితో పాటు ముడి చమురు ధర సైతం రోజూరోజుకీ పెరిగిపోతోంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల కోసం మరిన్ని ఛార్జింగ్ సదుపాయాలను కల్పించాలని కేంద్రం భావిస్తోంది. 
 
ఇప్పటికే నీతి ఆయోగ్ సైతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రమోట్ చేస్తూ వాటిపై రిబేట్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. నీతి ఆయోగ్ ఆదేశాలు అమలు చేసినట్లయితే అన్ని రాష్ట్రాల రహదారులపై ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్‌లు త్వరలో అందుబాటులోకి వస్తాయి. అయితే వీటికి కేవలం రూ.30 చెల్లిస్తే 15 నిమిషాల పాటు ఛార్జింగ్ చేస్తారు. దీంతో సుమారు 22 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రమోట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానుంది.
 
ఢిల్లీలో ఇప్పటికే ఆ ప్రభుత్వం రద్దీ ప్రాంతాల్లో ఛార్జింగ్ సదుపాయాలను కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మార్చి నాటికి ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం ఒక్క ఢిల్లీలో మాత్రమే 84 స్టేషన్‌లను ఏర్పాటు చేయనున్నారు. పార్కింగ్ ప్రాంతాల్లో సైతం ఛార్జింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ కుమార్ తెలిపారు.
 
అంతేకాకుండా ఛార్జింగ్ స్టేషన్‌ల సంఖ్య పెరిగిందంటే వాహనచోదకులు సైతం ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లో కేవలం 15 నిమిషాల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ చేయవచ్చు. కాగా ఎలక్ట్రిక్ కారు‌కు పూర్తిగా ఛార్జ్ చేయాలంటే కనీసం 1 గంట 30 నిమిషాలు సమయం పడుతుందని తెలియజేసారు.