గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 12 ఏప్రియల్ 2021 (15:50 IST)

మహిళా బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య.. పని ఒత్తిడి తట్టుకోలేక ఈ నిర్ణయం...

కన్నూర్ పరిధిలో గల తొక్కిలంగడి లోని కెనరా బ్యాంకులో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒక మహిళా బ్యాంక్ మేనేజర్ తన కార్యాలయంలోనే ఉరి వేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తోక్కిలంగడి కెనరా బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్, కె.స్వప్న(38) శుక్రవారం ఉదయం 9 గంటలకు బ్యాంకు కార్యాలయంలో ఉరి వేసుకొని చనిపోయారు. 
 
మరొక మహిళా బ్యాంకు ఉద్యోగి ఉదయం 9 గంటలకు పని నిమిత్తం బ్యాంకు కార్యాలయంలోకి వెళ్లగానే మేనేజర్ ఉరి వేసుకుని కనిపించడం చూసి బ్యాంకు అలారం నొక్కారు. వెంటనే అక్కడ ఉన్న స్థానిక ప్రజలు, బ్యాంకు సిబ్బంది కలిసి ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమెను రక్షించలేకపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం కుతుపరంబా తాలూకా ఆసుపత్రికి తరలించారు.
 
కుతుపరంబా ఎసీపీ కెజి సురేష్, ఎస్ఐ కెటి సందీప్ సంఘటన స్థలానికి చేరుకుని సీసీటివి విజువల్స్ తనిఖీ చేశారు.పోలీసులు స్వప్న డైరీని స్వాధీనం చేసుకున్నారు. దీనిలో ఆమె పని ఒత్తిడిని తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అందులో వ్రాయబడింది. స్వప్నను సెప్టెంబర్ 2020లో తోక్కిలంగడి బ్రాంచ్‌లో పోస్ట్ చేశారు. కన్నూర్‌లోని నిర్మలగిరిలో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తోంది. త్రిసూర్ జిల్లాలోని మన్నూతి స్వప్న స్వస్థలం.