మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కరోనా లాక్డౌన్ కేసులన్నీ ఉపసంహరణ.. సీఎం యోగి నిర్ణయం

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం లాక్డౌన్ అమలు చేసింది. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేశాయి. అయినప్పటికీ అనేక మంది ఈ లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించారు. ఇలాంటి వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇపుడు ఈ కేసులను ఉపసంహరించుకోనున్నట్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 
 
రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ విధించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన సామాన్యులపై గతంలో వేసిన కేసులను వెనక్కి తీసుకోవాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా రాష్ట్రంలోని కొన్ని లక్షల మందికి ఉపశమనం కలగనుంది. 
 
సీఎ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన లాక్డౌన్ ఉల్లంఘన కేసులను ఉపసంహరించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో వ్యాపారులపై వేసిన ‘ఉల్లంఘన’ కేసులను ఇటీవలే వెనక్కి తీసుకున్నారు. 
 
ఇప్పుడు సాధారణ ప్రజానీకంపై వేసిన కేసులు ఉపసంహరించనున్నారు. కాగా దేశంలో తొలిసారిగా లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన కేసులను వెనక్కి తీసుకున్న తొలి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది.