శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2016 (13:16 IST)

జయలలిత మృతి మిస్టరీ ఎందుకు? డెడ్ బాడీని బయటకు తీయాలా? : హైకోర్టు ప్రశ్న

దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలో పొందిన చికిత్సపై గోప్యత పాటించాల్సిన అవసరం ఏముందని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. అందువల్ల జయలలిత మరణంపై సందేహాలు ఉన్నాయని హైకోర్టు న్యాయమూర్తి వైద్యనాథన్ సందేహం

దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలో పొందిన చికిత్సపై గోప్యత పాటించాల్సిన అవసరం ఏముందని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. అందువల్ల జయలలిత మరణంపై సందేహాలు ఉన్నాయని హైకోర్టు న్యాయమూర్తి వైద్యనాథన్ సందేహం వ్యక్తం చేశారు. అలాగే, జయలలిత మృతదేహాన్ని ఎందుకు వెలికితీయకూడదని హైకోర్టు ప్రశ్నించింది.
 
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నజయలలిత సెప్టెంబర్ 22వ తేదీన అస్వస్థతకు లోనై చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో 75 రోజుల పాటు చికిత్స పొంది డిసెంబర్ 5వ తేదీ అర్థరాత్రి కన్నుమూసిన విషయంతెల్సిందే. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అత్యంత గోప్యత పాటించారు. చివరకు కేంద్ర రాష్ట్ర మంత్రులను కూడా జయలలిత చికిత్స పొందుతున్న గది వైపుకు వెళ్లనీయలేదు.
 
దీంతో జయలలిత మరణంపై సందేహాలున్నాయని పేర్కొంటూ దాఖలైన పిటీషన్‌ను మద్రాసు హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై గురువారం జస్టిస్ వైద్యనాథన్ విచారణ జరిపారు. జయలలిత మరణంపై సందేహాలున్నాయని, అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని వ్యాఖ్యానించారు.
 
జయలలితకు ఎలాంటి చికిత్స అందిందో కేంద్ర రాష్ట్రాలకు తెలుసు. కానీ ఎందుకు మౌనంగా ఉందో.. ఎందుకు గోప్యత పాటించిందో తెలియదని న్యాయమూర్తి అన్నారు. జయ మృతిపై జనవరి 9లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు, నోటీసులు జారీ చేశారు. 
 
ఈ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు తీవ్రంగా మందలించింది. జయలలిత మరణంపై దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్‌ వైద్యనాథన్‌, జస్టిస్‌ పార్తీబన్‌ ధర్మాసనం విచారించింది. తాను ఒక్కడినే ఈ పిటిషన్లను విచారించాల్సి వస్తే పరిస్థితి మరోలా ఉంటుందని జస్టిస్ వైద్యనాథన్ వ్యాఖ్యానించడం విశేషం.