గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2023 (14:46 IST)

తమిళనాడులో డీఎంకే మంత్రి పొన్ముడికి మూడేళ్ల జైలుశిక్ష

ponmudi
తమిళనాడులో డీఎంకే మంత్రి పొన్ముడికి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ మేరకు గురువారం తీర్పును వెలువరించింది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న కేసులో డాక్టర్ పొన్ముడి దంపతులకు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 
 
కాగా, అక్రమార్జన కేసులో పొన్ముడి, ఆయన భార్య విశాలాక్షిని నిర్దోషులుగా పేర్కొంటూ వేలూరులోని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును మద్రాసు హైకోర్టు రెండు రోజుల క్రితం కొట్టివేసి.. తీర్పును రిజర్వు చేసింది. గురువారం మంత్రి, ఆయన భార్యను దోషులుగా తేల్చి మూడేళ్ల జైలు శిక్షతోపాటు, రూ.50 లక్షలు జరిమానా విధిస్తూ జస్టిస్‌ జి.జయచంద్రన్‌ తీర్పు వెలువరించారు. 
 
అలాగే, ఈ కేసులో నిందితులు లొంగిపోయేందుకు 30 రోజుల గడువు ఇచ్చారు. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు అవకాశం తెలిపారు. మరోవైపు రెండేళ్లకు మించి జైలు శిక్ష పడటంతో పొన్ముడి తన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు. అలాగే, మంత్రి పదవికి కూడా రాజీనామా చేయనున్నారు. 
 
కాగా, మంత్రి పొన్ముడి తొలిసారి 1989లో డీఎంకే టికెట్‌పై విల్లుపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1996-2001లో రవాణాశాఖ మంత్రిగా ఉన్నసమయంలో పొన్ముడి, ఆయన భార్య ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు 2002లో అవినీతి నిరోధకశాఖ కేసు నమోదు చేసింది. 
 
దీని విచారణలో వారిపై ఆరోపణలు రుజువు కాలేదని, తగిన ఆధారాలు లేకపోవడంతో నిందితులను విడుదల చేస్తున్నట్లు గతేడాది జూన్‌ 28న వేలూరు కోర్టు తీర్పు వెలువరించింది. ఏసీబీ ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేయలేదు. 
 
దీంతో మద్రాస్‌ హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి మంత్రి పొన్ముడి, ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. అనంతరం ఏసీబీ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన హైకోర్టు పొన్ముడి, ఆయన భార్య 64.90 శాతం ఆదాయానికి మించి అధికంగా ఆస్తిని కూడబెట్టినట్లు రుజువైందని, వారికి మూడేళ్లు జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.