శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

సీబీఐ చేతికి హత్రాస్ హత్యాచార ఘటన : సీఎం యోగి నిర్ణయం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ హాత్రాస్ అత్యాచారం, హత్య ఘటన దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తూ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన శనివారం సాయంత్రం ఓ ప్రకటన చేశారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన కాసేపటికే యోగి సర్కారు నుంచి ఈ ప్రకటన వెలువడింది.
 
'ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మొత్తం హాత్రాస్ కేసు దర్యాఫ్తును సీబీఐకి అప్పగించారు' అని సీఎం కార్యాలయం, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. కాగా, ఈ ఘటనపై ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈ కేసులోని నలుగురు నిందితులను ఉరి తీయాల్సిందేనని డిమాండ్ చేశారు.
 
ఈ మొత్తం వ్యవహారం బీజేపీపై ఒత్తిడిని పెంచుతోందని, ఇటీవలికాలంలో దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. హాత్రాస్ ఘటనతో పాటు రెండు హత్యాచారాలు, పలు అత్యాచారాలు గడచిన వారం రోజుల వ్యవధిలో వెలుగులోకి వచ్చాయి. 
 
మరోవైపు, హత్రాస్ సంఘటనపై యోగి ప్రభుత్వం పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడంతో పోలీసులు లోలోన రగిలిపోతున్నారు. ఎస్పీ, డీఎస్పీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ కావడంపై పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా మండిపడింది.
 
'ఎస్పీపై చర్యలకు ఆదేశించినపుడు, కలెక్టరుపై కూడా ఎందుకు చర్యలు తీసుకోరు? నిర్లక్ష్యానికి కేవలం పోలీసు శాఖనే బలి కావాలా? పోలీసు శాఖ ఎలా బాధ్యత వహిస్తుంది? పరిపాలనా పరమైన ఆదేశాలు ఎవరిస్తారు? ఆ ఆదేశాలకూ, పోలీసు శాఖకు సంబంధమేమి? పరిపాలనా విభాగం ఆదేశాలిస్తే.. వాటిని పోలీసు శాఖ అమలు చేస్తుంది అంతే. కలెక్టర్ ఆదేశాల ప్రకారమే తాము నడుచుకున్నామని ఎస్పీ, డీఎస్పీలు సైతం ప్రకటించారు' అని పోలీసు సంక్షేమ సంఘం పేర్కొంటోంది. అంతేకాకుండా, ఎస్పీ, డీఎస్పీతో పాటు బాధిత కుటుంబీకులపై కూడా ‘నార్కో’ పరీక్షలు నిర్వహించాలన్న ప్రతిపాదనపై పోలీసు సంఘం మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.